సిద్దిపేటలో ఘర్షణ

ABN , First Publish Date - 2020-11-03T07:45:01+05:30 IST

తెల్లారితే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ఉందనగా సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. అందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ బస

సిద్దిపేటలో ఘర్షణ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ బస చేసిన హోటల్‌ వద్దకు వెళ్లిన బీజేపీ నేతలు

దుబ్బాకకు డబ్బు పంపిస్తున్నారని వాగ్వాదం

ఉద్రిక్తత.. టీఆర్‌ఎస్‌ కార్యకర్త చేతికి గాయం

బీజేపీ నేతలపై పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు

గూండాల్లా మీద పడ్డారు: ఎమ్మెల్యే క్రాంతి

బీజేపీ కుట్రలో భాగంగానే దాడి: మంత్రి హరీశ్‌

పోలీస్‌ యంత్రాంగం మత్తులో ఉందా?: సంజయ్‌

సిద్దిపేట/హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెల్లారితే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ఉందనగా సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. అందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ బస చేసిన హోటల్‌ వద్ద ఆయనకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరి చేతివేలికి గాయమైంది. దుబ్బాక ఉప ఎన్నికలో తొగుట మండల టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా ఉన్న క్రాంతికిరణ్‌.. ఓటర్లకు పంచేందుకు డబ్బు పంపిస్తున్నారంటూ బీజేపీ నేతలు సోమవారం రాత్రి స్వర్ణప్యాలెస్‌ లాడ్జి వద్దకు వెళ్లారు.


నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి క్రాంతికిరణ్‌ తన గదిలో భోజనం చేస్తుండగా అక్కడికి వెళ్లిన బీజేపీ నేతలు.. డబ్బు గురించి ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీయగా.. అడ్డుకోబోయిన సైదులు అనే టీఆర్‌ఎస్‌ కార్యకర్త చేతివేలికి  గాయమైంది. హోటల్‌ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హోటల్‌ వద్దకు చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అప్పటికే బీజేపీ నేతలు అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 


ఓర్వలేకనే దాడి: ఎమ్మెల్యే క్రాంతి

తాను ఇన్‌చార్జిగా ఉన్న తొగుట మండలలో టీఆర్‌ఎ్‌సకు వస్తున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు తనను టార్గెట్‌ చేశారని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు. ఆ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డితోపాటు మరికొందరు తనపై దాడి చేశారని తెలిపారు. ఏదైనా ఉంటే పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఇక్కడకు ఎందుకు వచ్చారని తాను ప్రశ్నించగా.. గూండాల్లా మీద పడేందుకు వచ్చారని అన్నారు. తన సిబ్బంది వెంటనే స్పందించి అడ్డుకున్నారని తెలిపారు. వారిపై పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు.


కాగా, బీజేపీ నాయకులు రౌడీల్లా క్రాంతికిరణ్‌పై దాడి చేశారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. తాను కూడా అదే హోటల్‌లో ఉన్నానని,  తనపైకి కూడా దూసుకొచ్చే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారని తెలిపారు. కాగా స్వర్ణప్యాలెస్‌ లాడ్జిలోని తన గదిలో ఉన్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై 30 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడిచేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. లాడ్జిలోని సీసీ పుటేజీల ఆధారంగా  విచారణ ప్రారంభించామన్నారు. 


బీజేపీ యాక్షన్‌ప్లాన్‌లో భాగమే: హరీశ్‌

అల్లర్లు, కుట్రలు చేయాలనే బీజేపీ యాక్షన్‌ప్లాన్‌లో భాగంగానే ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై దాడి జరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలో టీఆర్‌ఎ్‌సకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే అసహనానికి గురవుతున్నారని మండిపడ్డారు. ఒక దళిత ఎమ్మెల్యేపై, మరో దళిత మాజీ ఎమ్మెల్యేపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. బీజేపీ నేతలు దుర్మార్గమైన ప్రణాళికలు రచించారని, వాటి అమలులో భాగంగానే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే దుశ్చర్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.


దాడికి చేయడానికి 15 నిమిషాల ముందే పోలీసులు వచ్చి లాడ్జిలోని గదులను తనిఖీ చేశారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం దుబ్బాక నియోజకవర్గంలో కాకుండా సిద్దిపేటలో క్రాంతికిరణ్‌ ఉన్నారన్నారు. బీజేపీ నేత జితేందర్‌రెడ్డి రామాయంపేటలోనే ఉన్నారని, వాళ్లకు వర్తించని నిబంధనలు తమ వాళ్లకు వర్తిస్తాయా?అని ప్రశ్నించారు. క్రాంతికిరణ్‌పై దాడి హేయమైన చర్య అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. 


Updated Date - 2020-11-03T07:45:01+05:30 IST