రేపటి నుంచి సిటీ బస్సులు!

ABN , First Publish Date - 2020-09-24T08:28:37+05:30 IST

హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సులు నడవున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 185 రోజుల తర్వాత బుధవారం పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డెక్కాయి.

రేపటి నుంచి సిటీ బస్సులు!

రోడ్డెక్కనున్న 3200 బస్సులు.. బుధవారం పాక్షికంగా ప్రారంభం

135 రూట్లలో తిరిగిన 229 ఆర్డినరీ బస్సులు


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సులు నడవున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 185 రోజుల తర్వాత బుధవారం పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డెక్కాయి. నగర శివారు డిపోల నుంచి మాత్రమే అదీ ఆర్డినరీ బస్సులనే పరిమితంగా నడిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 135 రూట్లలో డిపోకు 10-12 బస్సుల చొప్పున 229 బస్సులు తిరిగాయి.  గ్రేటర్‌ పరిధిలోని డిపోల్లో మొత్తంగా 3,200 వరకు సిటీ బస్సులున్నాయి. ఈ బస్సులను శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో నడిపేదిశగా చర్యలు వేగవంతం అవుతున్నట్లు తెలిసింది. లాక్‌డౌన్‌, కరోనా కారణంగా మార్చి 19న జిల్లా, సిటీ బస్సులు నిలిపివేశారు. జిల్లాల్లో బస్సులు నడుపుకొనేందుకు కేంద్రం అనుమతించడంతో మే 19న పునఃప్రారంభమయ్యాయి. అంతర్రాష్ట్ర బస్సుల విషయంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉండడంతో వాటిని పునఃప్రారంభించలేకపోయారు. అప్పటికి కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉండటం, సిటీ బస్సుల్లో కొవిడ్‌-19 నిబంధనలు పాటించడం కష్టంగా ఉండటంతో ఆ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సిటీ బస్సులు మూడు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బుధవారం శివారు బస్సులను ప్రారంభించారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో మొత్తం 29 డిపోలున్నాయి.  అయితే రాజేంద్రనగర్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, హకీంపేట, ఫలక్‌నుమా, మిథాని, మియాపూర్‌, పికెట్‌, ఫరూక్‌నగర్‌, హయత్‌నగర్‌ వంటి శివారు డిపోల నుంచి బస్సులను ప్రారంభించారు. శివారు ప్రాంతాల్లో 15 కిలో మీటర్ల రేంజ్‌లో ఈ బస్సులను తిప్పారు. సిటీ బస్సుల ప్రారంభంపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడినట్లు తెలిసింది. సిటీ బస్సులను ఏ క్షణంలోనైనా ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులు కూడా అంతా సిద్ధం చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పూర్తిస్థాయిలో బస్సులును నడిపినా ఇబ్బందులుండవని వారు నివేదించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-09-24T08:28:37+05:30 IST