పిల్లల బియ్యం.. ఎలుకల పాలు!

ABN , First Publish Date - 2020-09-18T09:11:42+05:30 IST

ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనం పెట్టేందుకు సరఫరా చేసిన బియ్యం ముక్కిపోతున్నాయి. కరోనా వల్ల 6 నెలలుగా స్కూళ్లు తెరచుకోకపోవడంతో అక్కడ నిల్వ ఉంచిన బియ్యం పురుగులు, ఎలుక లు,

పిల్లల బియ్యం..  ఎలుకల పాలు!

  • వృధాగా మధ్యాహ్న భోజన బియ్యం..
  • కరోనాతో 6 నెలలుగా స్కూళ్లలోనే పురుగు పట్టిన వేల టన్నులు
  • ఆకలితో అలమటిస్తున్న పేద విద్యార్థులు
  • ‘‘ఆంధ్రజ్యోతి’’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు రోజూ మధ్యాహ్న భోజనం పెట్టేందుకు సరఫరా చేసిన బియ్యం ముక్కిపోతున్నాయి. కరోనా వల్ల 6 నెలలుగా స్కూళ్లు తెరచుకోకపోవడంతో అక్కడ నిల్వ ఉంచిన బియ్యం పురుగులు, ఎలుక లు, పందికొక్కుల పాలవుతున్నాయి. మరోవైపు కరోనాతో తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడంతో ఎంతోమంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. స్కూళ్లు తెరిస్తే మధ్యాహ్న భోజనం రూపంలో కనీసం ఒక్క పూటయినా భోజనం చేయవచ్చని వారు భావిస్తున్నారు. కానీ, ఇప్పట్లో మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఆ బియ్యం అటు విద్యార్థుల ఆకలి తీర్చక, ఇటు వెనక్కి పంపించక.. కుళ్లిపోతున్నాయి.వాటిని పేదలకు పంచి కొన్నాళ్లపాటు ఆకలి తీర్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఉపాధ్యాయులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఇలా వేలాది టన్నుల బియ్యం వృధాగా పడి ఉన్న తీరు ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. 


నిల్వ ఉన్న 17 రోజుల బియ్యం..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలన్నీ కలిపి 30 వేల వర కు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 6-10 తరగ తులకు బోధించే ఉన్నత పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి రోజూ 150 గ్రాముల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుం ది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు 110 గ్రాముల చొప్పున అందజేస్తుంది. అయితే ఈ ఏడాది మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థులు మాత్రం మార్చి 14 నుంచే వెళ్లలేదు. కానీ, అన్ని స్కూళ్లకు మార్చి నెలలో 31 రోజులకు సరిపడా బియ్యాన్ని ప్రభుత్వం అప్పటికే సరఫరా చేసింది. దీంతో మిగిలిన 17 రోజుల బియ్యం స్కూళ్లలోనే ఉండిపోయింది. ఉదాహరణకు ఒక హైస్కూల్‌లో రోజుకు 150 గ్రాముల చొప్పున 17 రోజులకు ఒక విద్యార్థికి ఉపయోగించాల్సిన బియ్యం 2.55 కేజీలు అక్కడే ఉండిపోయాయి. ఈ లెక్కన 100 మంది విద్యార్థులు ఉన్న స్కూల్‌లో 255 కేజీల బియ్యం మిగిలిపోయాయి. ఇలా అన్ని స్కూళ్లు, సంక్షేమ వసతి గృహాలను కలుపుకొంటే మిగులు సంఖ్య వేల టన్నుల్లో ఉంటుంది. 


కుళ్లిపోతున్నా పట్టించుకోవట్లేదు.. 

ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యం పలు చోట్ల ఎలుకల పాలవగా.. అనేక చోట్ల పురుగులు పడి, కుళ్లిపోయి వినియోగించడానికి వీల్లేకుండా పోయింది. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు ఎంఈవో, డీఈవోల దృష్టికి తీసుకెళ్లినా ప్రభు త్వం స్పందించక పోవడంతో ఏమీ చేయలేకపోతున్నారు. శిథిలావస్థలో ఉన్న స్కూళ్లలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. వర్షాలకు నీరు చేరడంతో బియ్యం తడిసి గడ్డలుగా మారాయి. అనేక చోట్ల సగం బియ్యం ఎలుకల పాలయ్యాయి. మరిన్ని చోట్ల పురుగులు పడి కుళ్లిపోయాయి. ఇలా బియ్యాన్ని వృధా చేసేబదులు పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇచ్చినా కనీసం వారికి కొన్ని రోజులపాటు ఆకలిబాధ అయినా తీరుతుందని పలువురు ఉపాధ్యాయులను సూచిస్తున్నారు. 


  రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ స్కూళ్లలో 140.73 మెట్రిక్‌ టన్నుల బియ్యం పురుగుపట్టింది. సిద్దిపేట జిల్లాలోని 976 ప్రభుత్వ పాఠశాలల్లో 150-200 టన్నుల బియ్యం ఎలుకలకు, పందికొక్కులకు ఆహారంగా మారుతోంది. సిరిసిల్ల జడ్పీ హైస్కూల్‌లో 2 క్వింటాళ్లు పాడైపోయింది. ఈ జిల్లాలో 499 స్కూళ్లలో 103 టన్నుల బియ్యం నిల్వ ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని 1425 స్కూళ్లలో 926 క్వింటాళ్ల బియ్యంలో పంది కొక్కుల వల్ల చాలావరకు తరిగిపోయాయి. మిగిలిపోయిన బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులకు అప్పగించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ అప్పట్లోనే జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు. 


సార్‌.. అన్నం పెడతారా!

వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూశాయంపేట జాగీర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 257, ప్రాథమిక పాఠశాలలోని 147 మంది విద్యార్థుల్లో 90ుమందికి పైగా అత్యంత నిరుపేదలు. బండ పనులు, కూలీ పనులు చేసుకునే వారి పిల్లలే. మధ్యాహ్నం అన్నం పెడతారన్న ఆశతోనే తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపేవారు. కరోనాతో పనుల్లేక అనేక కుటుంబాలు, వారి పిల్లలు పస్తులుంటున్నారు. ఆగస్టు 27 నుంచి టీచర్లు రావ డం చూసి విద్యార్థులు స్కూలు తిరిగి ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. రోజూ స్కూలు వద్దకొ చ్చి, ‘సార్‌.. అన్నం ఎప్పటినుంచి పెడతారు?’ అంటూ టీచర్లను అడుగుతున్నారు. అయితే స్కూళ్లు ఇంకా తెరవలేదని ఉపాధ్యాయులు వారికి సర్ది చెబుతున్నారు. 

Updated Date - 2020-09-18T09:11:42+05:30 IST