శిశు మరణాల రేటులో తగ్గుదల

ABN , First Publish Date - 2020-05-11T08:52:58+05:30 IST

ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. ఐదేళ్ల కిందట ప్రతి వెయ్యి జననాలకు..

శిశు మరణాల రేటులో తగ్గుదల

  • రాష్ట్రంలో వెయ్యి మందికి 27 మరణాలు

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) రాష్ట్రంలో గణనీయంగా తగ్గింది. ఐదేళ్ల కిందట ప్రతి వెయ్యి జననాలకు 39 మంది శిశువులు మరణించేవారు. తాజాగా 2018 గణాంకాల్లో ఈ రేటు 27కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన శాంపిల్‌ రిజిరేస్టషన్‌ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్‌) సర్వే ద్వారా ప్రభుత్వం ఈ గణాంకాలను ప్రకటించింది. శిశు మరణాల రేటులో జాతీయ సగటు (32) కన్నా తెలంగాణ (27) లో తక్కువ సగటు నమోదవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో తల్లీబిడ్డల సంరక్షణకు మార్గం సుగమమైందని పేర్కొన్నాయి. మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ టీకాల అమల్లోనూ దేశంలో గుర్తింపు స్థానంలో రాష్ట్రం నిలిచిందని చెప్పాయి. ప్రభుత్వం 29 ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్స్‌) లను నిర్వహిస్తూ నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడుతోందని, ఫలితంగా శిశు మరణాల రేటు తగ్గాయని వైద్యవర్గాలు తెలిపాయి.


తెలంగాణలో మొత్తంగా శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి మందికి) 27గా ఉంది. అందులో ఈ రేటు ఆడ శిశువుల్లో 26, మగ శిశువుల్లో 27గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 30గా ఉండగా, పట్టణాల్లో 21గా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో వైద్య వసతులు ఉండటం వల్ల శిశు మరణాల రేటు తక్కువగా నమోదైంది. ఇక దేశంలో అత్యంత తక్కువ శిశు మరణాల రేటు నాగాలాండ్‌లో రికార్డయింది. అక్కడ ఈ రేటు నాలుగు మాత్రమే. ఆ తర్వాత మిజోరంలో ఐదు, గోవా, కేరళల్లో ఏడు చొప్పున శిశు మరణాల రేటు నమోదైంది. దేశంలో మధ్యప్రదేశ్‌లో అత్యంత ఎక్కువగా శిశు మరణాల రేటు (48) ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఐఎంఆర్‌ 50 నుంచి 32కి తగ్గిందని ఎస్‌ఆర్‌ఎస్‌ తెలిపింది.

Updated Date - 2020-05-11T08:52:58+05:30 IST