బంద్‌కు సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2020-12-07T08:26:16+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు ఈ నెల 8న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొననున్నాయి. జాతీయ రహదారులపై మధ్యాహ్నం 12 గంటల వరకూ రాస్తారోకో కూడా జరుగుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు

బంద్‌కు సంపూర్ణ మద్దతు

రేపటి బంద్‌లో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

రైతులకు అండగా నిలవాలని విజ్ఞప్తి

కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు: భట్టి

పలు పార్టీలు, సంఘాలు కూడా..


హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు ఈ నెల 8న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొననున్నాయి. జాతీయ రహదారులపై మధ్యాహ్నం 12 గంటల వరకూ రాస్తారోకో కూడా జరుగుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. రైతులకు మద్దతుగా వ్యాపార, వాణిజ్యవర్గాలు కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాతే దుకాణాలను తెరవాలని కోరారు. ఆర్టీసీ బస్సులను కూడా మధ్యాహ్నం తర్వాతే నడపాలని సూచించారు. బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ వికాస సమితి, ఆటో యూనియన్‌, ఇతర సంఘాలు కూడా బంద్‌కు సంఘీభావం తెలిపాయి. భారత్‌ బంద్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసే న్యాయమైన పోరాటాన్ని ఆయన సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న వ్యవసాయ బిల్లులను టీఆర్‌ఎస్‌ పార్లమెంటులోనే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కొత్త చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సినఅవసరం ఉందన్నారు. బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


ఎన్‌హెచ్‌లపై రాస్తారోకో: కేటీఆర్‌

కేంద్రం వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారులపై రాస్తారోకో చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్‌ కావాలని, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో ఏ ఒక్కదానిలోనూ పంటలకు కనీస మద్దతు ధరపై హామీ లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేసి మద్దతు ధర కొనసాగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వికాస సమితి డిమాండ్‌ చేసింది. భారత్‌ బంద్‌కు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మద్దతు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్‌ఎ్‌ఫఐ, పీడీఎస్‌యూ, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐడీఎ్‌సవో పిలుపునిచ్చాయి. 


ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే

రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. భారత్‌ బంద్‌తో కేంద్రం దిగి రావాలన్నారు. 9న జరిగే మలివిడత చర్చలు ఒక కొలిక్కి రాకుంటే దేశాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునేదాకా తమ ఆందోళన విరమించబోమన్నారు. రైతుల ఆందోళనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌ బంద్‌లో వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం కిషన్‌ వర్గం రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం పిలుపునిచ్చారు.

Updated Date - 2020-12-07T08:26:16+05:30 IST