నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు..

ABN , First Publish Date - 2020-09-05T12:21:27+05:30 IST

నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు. ఫైనాన్స్‌ పేరిట కొందరు, అధిక లాభాల ఆశ చూపి మరి కొందరు అందిన కాడికి దోచుకుని బిచాణా ఎత్తేస్తున్నారు.

నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు. ఫైనాన్స్‌ పేరిట కొందరు, అధిక లాభాల ఆశ చూపి మరి కొందరు అందిన కాడికి దోచుకుని బిచాణా ఎత్తేస్తున్నారు. మరి కొందరు చిట్టీలు, వ్యాపార భాగస్వామ్యం అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలూ పెట్టి శఠగోపం పెడుతున్నారు. కొందరు రెండడుగులు ముందుకేసీ సామాజిక వర్గం కార్డును కూడా వాడుకుంటూ,  నమ్మకాన్ని పెంచుకుని అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలా రోజుకో రకంగా అమాయకులను మోసం చేసేవారు పెరుగుతున్నారు. 


రూ. 2.36 కోట్లతో పరారీ

మతగురువు ముసుగులో ఒకరు ప్రత్యేకంగా తన వర్గం వారి విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. తాను షేర్‌మార్కెట్‌లో కన్సల్టెంట్‌నని చెప్పి, రూ. లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ. 3 వేల లాభం వస్తుందని  ఆశపెట్టాడు. తనకున్న పరిచయాలనే ఆసరాగా చేసుకుని ఏకంగా 38 మందిని బురిడీ కొట్టించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా వాస్తవ్యుడైన సయ్యద్‌ ముఖ్తార్‌ (37) విజయ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటూ స్థానికుల నుంచి రూ. 2.36 కోట్లు తీసుకుని పారిపోయాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు సీసీఎ్‌సను ఆశ్రయించారు.


అవసరాలు ఆసరాగా.. 

ఫలక్‌నుమా, జహనుమా ప్రాంతానికి చెందిన ఓ ఫైనాన్స్‌ వ్యాపారి స్థానిక పరిచయాల ఆసరాగా అధిక వడ్డీ మీద రుణాలిస్తుంటాడు. తాను రౌడీనని, పోలీసులతో పరిచయాలున్నాయని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. అవసరం కొద్దీ ఎవరైనా డబ్బులు అడిగితే, అడిగిన దానికి తక్కువ ఇచ్చి, ఎక్కువ ఇచ్చినట్లు కాగితం రాయించుకుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ చిరు వ్యాపారి అతని వద్ద నుంచి అప్పు తీసుకున్నాడు. ఇద్దరూ పరిచయస్తులే అయినప్పటికీ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని వేధించడంతో, అతడి వేధింపులు భరించలేక బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


హీరా గ్రూప్‌ ఓ పెద్ద స్కామ్‌..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గ్రూప్‌ పూర్తిగా పరిచయాల మీదే నడిచింది. ఓ మహిళ ప్రారంభించిన ఈ గ్రూపు అధిక లాభాలిస్తోందనే ఆశతో దేశ విదేశాల్లో ఉన్న స్థానికులు, ప్రవాసీయులు రూ. వేల నుంచి రూ. లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఒకరికి వస్తున్న లాభా లు చూసి మరొకరు ఇలా వేల మంది ఆ గ్రూపులో చేరారు. రూ. వందలతో ప్రారంభమైన ఈ గ్రూపు వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, గోల్డ్‌ లావాదేవీలు సాగుతుండటం అధిక లాభాల ఆశ, పరిచయమున్న వారు పెట్టుబడులు పెట్టారు కదా అనే విశ్వాసం పూర్తిగా ముంచాయి. దేశవ్యాప్తంగా, ప్రవాసీయులు లక్షల మంది, రూ. కోట్ల మేరకు మోసపోయారు.


పని చేసే బ్యాంకుకే..

ఖైరతాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర చీఫ్‌ మేనేజర్‌ సంస్థ నమ్మకాన్నే వమ్ము చేశాడు. డబ్బుకు ఆశ పడి అధికార దుర్వినియోగం చేస్తూ తప్పుడు పత్రాలపై రుణం మంజూరు చేశాడు. ఈ వ్యవహారంలో  అదే బ్యాంకు న్యాయ సలహాదారు నర్సింగ్‌రావు కూడా సహకరించాడు. దీంతో బ్యాంకునకు రూ. 1.8 కోట్ల నష్టం వాటిల్లింది. అప్పు తీసుకుని వాయిదాలు చెల్లించని నిందితులతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిని సీసీఎస్‌ పోలీసులు మూడు రోజుల క్రితం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. 


జాగ్రత్తలు పాటించాలి: పోలీసులు

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రోజూ చిట్టీల పేరిట, ఫైనాన్స్‌ పేరిట ఎక్కడో ఓ చోట ఇలాంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సంబంధం లేని, పరిచయం లేని వారితో ఎలాగూ మోసాలు తప్పడం లేదు. ఓటీపీ, బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌లో ఇలాంటి చీటర్లు రోజూ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే, పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడే వారితో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. లైసెన్సు లేని ఫైనాన్సర్లు, చిట్టీలు, ఇతర వ్యాపారుల మాటల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-09-05T12:21:27+05:30 IST