గచ్చీబౌలి కరోనా ప్రత్యేక ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2020-04-26T00:28:06+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది.

గచ్చీబౌలి కరోనా ప్రత్యేక ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. ప్రధానంగా గచ్చీబౌలి స్టేడియం సమీపంలో ఏర్పాటుచేసిన 1500 పడకల ప్రత్యేక కరోనా హాస్పిటల్‌ను పరిశీలించారు. అలాగే నిరుపేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్న నార్సింగిలోని అతిపెద్ద కిచెన్‌ అక్షయపాత్రను కూడా ప్రత్యేక బృందం సందర్శించింది. భారత జలశక్తిశాఖ అడిషనల్‌ సెక్రటరీ అరుణ్‌ బరోకా నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో పబ్లిక్‌హెల్త్‌ సీనియర్‌ స్పెషలిస్ట్‌ డాక్డర్‌ చంద్రశేఖర్‌ గెడం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ న్యూట్రిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, కన్సూమర్‌ అఫెయిర్స్‌ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేది తదితరులు ఉన్నారు.


ఈ బృందం కొవిడ్‌ ఆస్పత్రిలో చేసిన ఏర్పాట్లపై పంచాయితీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావ్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డా.జయరాంరెడ్డిలు వివరించారు. 2007లో జరిగిన ప్రపంచ మిలిటరీ క్రీడల సందర్భంగా ఈ భవనాన్నినిర్మించారు. 14 అంతస్తుల ఈభవనంలో 1500 పడకల ఆస్పత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇప్పటికే గాంధీహాస్పిటల్‌, కింగ్‌కోఠి ఆసుపత్రులను పూర్తిస్థాయి కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించిన ఐసొలేషన్‌ ఆసుపత్రులుగా మార్చామని అన్నారు. ఆయా ఆసుపత్రుల్లో స్థాయిని మించి   కేసులు నమోదయితే గచ్చీబౌలి ప్రత్యేక ఆసుపత్రికి తరలిస్తామని వివరించారు.


ఒక్కహైదరాబాద్‌లోనే రెండు వేల పడకలు(బెడ్స్‌) వివిధ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్నిజిల్లా ప్రధాన ఆస్పత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్చినట్టు వెల్లడించారు. కోవిడ్‌ నివారణ, చికిత్సలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించే చేస్తున్నట్టు రఘునందన్‌రావు తెలిపారు. అనంతరం ప్రత్యేక బృందం అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న మెగా కిచెన్‌ను పరిశీలించింది. కరోనా వైరస్‌ నేపధ్యంలో తమ కేంద్రం ద్వారా రోజుకు లక్షన్నర మందికి మధ్యాహ్న, సాయంత్రం భోజనాలను అందిస్తున్నట్టు ఫౌండేషన్‌ ప్రతినిఽదులు వివరించారు. జీహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన 150 అన్నపూర్ణ కేంటీన్ల ద్వారా ఈభోజనాలను అందిస్తున్నట్టు చెప్పారు. కరోనా వ్యాధి అనంతరం ఈ అన్నపూర్ణ కేంద్రాలను 200లకు పెంచనున్నట్టు తెలిపారు. దీంతో పాటు మొబైల్‌ వాహనాల ద్వారా కూడా భోజనాలను అందిస్తున్నట్టు వివరించారు. 

Updated Date - 2020-04-26T00:28:06+05:30 IST