హైదరాబాద్‌కు కేంద్ర బృందం
ABN , First Publish Date - 2020-04-25T08:31:39+05:30 IST
తెలంగాణలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందాన్ని (ఐఎంసీటీ) పంపించనుంది.

లాక్‌డౌన్ అమలుపై పరిశీలన
హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో పరిస్థితి తీవ్రం
దేశంలో పలు చోట్ల ఆంక్షల ఉల్లంఘన
కేంద్ర హోం శాఖ ఆందోళన
రాష్ట్రాలకు సహకరించేందుకే
బృందాలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందాన్ని (ఐఎంసీటీ) పంపించనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను సందర్శించడానికి 6 ఐఎంసీటీ బృందాలను ఏర్పాటు చేసిన కేంద్రం.. శుక్రవారం మరో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు హైదరాబాద్, చెన్నై, ఠాణే, అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో పర్యటించనున్నాయని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తుంది. ముఖ్యంగా.. లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలు, నిత్యావసర సరుకుల సరఫరా, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా?, వైద్య సదుపాయాల సన్నద్ధత, వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ, పేద ప్రజలు, కార్మికులకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితి.. తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది.
ఏవైనా లోపాలుంటే పరిష్కరించడానికి రాష్ట్ర అధికార యంత్రాంగానికి తగిన సూచనలు, ఆదేశాలు ఇస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. కేంద్రం ఇంతకు ముందే ఏర్పాటు చేసిన ఆరు బృందాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన జిల్లాల్లో లాక్‌డౌన్ అమలుని, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌కు వెళ్టిన బృందం అక్కడ 171 కట్టడి ప్రాంతాలను గుర్తించింది.. అందులో 20 ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా ఉందని నివేదిక ఇచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ముఖ్యంగా అహ్మదాబాద్, సూరత్, ఠాణే, హైదరాబాద్, చెన్నైలలో పరిస్థితి తీవ్రంగా ఉందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని పాజిటివ్ కేసుల్లో 485 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయిన నేపథ్యంలోనే కేంద్ర బృందం నగరానికి రానుంది.
పర్యవేక్షణకు కాదు..
కేంద్ర బృందాలను, సీనియర్ అధికారులను రాష్ట్రాలకు పంపిస్తున్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకే తప్ప పర్యవేక్షణకు కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో పర్యటించే కేంద్ర బృందాలు సమర్పించే నివేదికల ద్వారా తమకు ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి తెలుస్తుందని, వైర్‌సను మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి ఆ వివరాలు తోడ్పడతాయని ఆయన వివరించారు. ఇప్పటివరకూ జరిపిన పరీక్షల్లో 4 శాతమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వైరస్ సామాజిక వ్యాప్తి జరగకుండా కట్టడి చేయగలిగామని తెలిపారు.