పరిధి నిర్ణయం మాదే

ABN , First Publish Date - 2020-10-24T08:18:41+05:30 IST

రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, వినియోగం విషయంలో అపెక్స్‌ కౌన్సిల్‌దే అంతిమ నిర్ణయమని కేంద్ర జలవనరుల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

పరిధి నిర్ణయం మాదే

కృష్ణా, గోదావరి బోర్డుల అధికారాలపై కేంద్రం స్పష్టత

డీపీఆర్‌, అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టూ చేపట్టరాదు

మార్పులు చేస్తే కొత్త ప్రాజెక్టులుగానే పరిగణన: కేంద్రం

అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌ వెల్లడి

అపెక్స్‌ కౌన్సిల్‌దే అంతిమ నిర్ణయమని స్పష్టీకరణ


న్యూఢిల్లీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, వినియోగం విషయంలో అపెక్స్‌ కౌన్సిల్‌దే అంతిమ నిర్ణయమని కేంద్ర జలవనరుల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులేవి చేపట్టినా గోదావరి, కృష్ణా నదీ జలాల బోర్డులు సాంకేతికంగా ఆమోదించిన తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. కేంద్ర జలవనరుల సంఘం, జలవనరుల శాఖ సాంకేతిక కమిటీ ఆమోదించని ప్రాజెక్టులను ఎప్పుడు చేపట్టినా.. భారీ, మధ్యతరహా, బహుళార్థ సాధక ప్రాజెక్టులకు సంబంధించి ఏ మార్పులు చేపట్టినా, వాటిని కొత్త ప్రాజెక్టుల కిందే పరిగణిస్తామని గత జనవరిలోనే రెండు రాష్ట్రాల అధికారులకు చెప్పినట్టు జలవనరుల శాఖ అధికారి ఈ సమావేశంలో గుర్తు చేశారు. అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినిట్స్‌ను శుక్రవారం ఆ శాఖ రెండు రాష్ట్రాలకూ పంపింది.


మినిట్స్‌ ప్రకారం.. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌-2 (కేడబ్ల్యూడీటీ-2) అవార్డు కోర్టు వివాదంలో ఉన్నందువల్ల తొలి ట్రైబ్యునల్‌ కేటాయింపులే వర్తిస్తాయని కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రెండు రాష్ట్రాలకు సమావేశంలో స్పష్టం చేశారు. గోదావరి బేసిన్‌లో.. ఆమోదించిన ప్రాజెక్టులు పూర్తిచేసిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం వల్లే రెండు రాష్ట్రాల్లో నీటి కొరత తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయ రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే దీర్ఘకాలిక నదీజలాల సమస్యలు తీరుతాయని హితవు చెప్పారు. గోదావరి ఎత్తిపోతల పథకం మొదటి దశకు మాత్రమే పీఎంకేఎ్‌సవై పథకం కింద సహాయం చేశామని, చట్టబద్ధమైన అనుమతులు లేని వాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌లు) సమర్పించాలని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చినట్లు ముందుకు వెళ్లలేవని.. సాంకేతిక, పర్యావరణ అనుమతులతో పాటు అన్ని అనుమతులూ పొందాల్సిందేనని చెప్పారు.


అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టి తప్పుడు సంకేతాలు పంపరాదన్నారు. ఇందుకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తూ డీపీఆర్‌లు సమర్పించేందుకు తాము వ్యతిరేకమేమీ కాదని స్పష్టం చేశారు. కాగా, రెండు రాష్ట్రాలూ సీడబ్ల్యూసీకిగానీ, బోర్డులకు కానీ ఎలాంటి డీపీఆర్‌లు సమర్పించకుండానే ఒకరి ప్రాజెక్టులపై మరొకరు ఫిర్యాదులు చే సుకుంటున్నాయని జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి అపెక్స్‌ కౌన్సిల్‌కు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా నదిపై 15, గోదావరిపై 4 ప్రాజెక్టులు చేపట్టగా.. తెలంగాణ కృష్ణా నదిపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టులు చేపట్టాయని, డీపీఆర్‌లు పదేపదే అడిగినా కూడా ఇవ్వట్లేదని తె లిపారు. మొత్తం ఈ 34 ప్రాజెక్టుల్లో తెలంగాణలో కేవలం రెండు ప్రాజెక్టులకే హైడ్రాలజీ, అంతర్‌ రాష్ట్ర అనుమతులు ఉన్నాయని, మరో రెండు ప్రాజెక్టులను పునర్విభజన చట్టంలో చేర్చారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏపీ, పోతిరెడ్డు పాడు ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్టులు ఆమోదించకుండా, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించకుండా ముందుకు వెళ్లకూడదని కేంద్రం లేఖ కూడా రాసిందని, అయినా ఇంతవరకూ ఎవరూ డీపీఆర్‌లు సమర్పించలేదని అధికారి తెలిపారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి గానీ నీటి లభ్యత తక్కువ ఉందని.. ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీటి నిర్వహణను సమర్థంగా చేపడితేకొత్త ప్రాజెక్టులకు కేటాయింపులు చేయొచ్చని పేర్కొన్నారు. కేడబ్ల్యూడీటీ-2 అవార్డు ఖరారయ్యాకే కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయాలని తెలంగాణ కోరుతోంది గానీ.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫై కాకపోతే అవి తమ అధికారాలను సమర్థంగా ఉపయోగించుకోలేవన్నదే కేంద్రం అభిప్రాయమని స్పష్టం చేశారు.  


చివరగా..

  1. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని భారత ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి తన అసమ్మతిని తెలిపారు. కానీ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ విషయంలో కేంద్రానికి విశేషాధికారం ఉందని, దాని ప్రకారం నోటిఫై చేస్తామని షెకావత్‌ వివరించారు.
  2. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956లోని సెక్షన్‌ 3 ప్రకారం కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలంటే.. ఆ రాష్ట్రం దీనిపై సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోవాలి. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అంగీకరించారు.
  3. రెండు రాష్ట్రాలూ బోర్డులకు తమ కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సమర్పించాలి. వాటి మదింపు వీలైనంత తక్కువ సమయంలో జరుగుతుందని షెకావత్‌ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ డీపీఆర్‌లు సమర్పించడానికి అంగీకరించారు. 
  4. రెండు రాష్ట్రాలూ అంగీకరించిన నేపథ్యంలో కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలిస్తారు.
  5. గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకూ న్యాయబద్ధంగా పంచడం కోసం గోదావరి ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయడానికి రెండు రాష్ట్రాలూ అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఇద్దరు ముఖ్యమంత్రులనూ షెకావత్‌ కోరారు. ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు వెంటనే విజ్ఞప్తి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు.


మా వాటా ఏమిటి?: కేసీఆర్‌

తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలైనా కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటా ఏమిటో తెలియదని, ఈ విషయాన్ని ట్రైబ్యునల్‌కు నివేదించాల్సిందిగా తాము కోరామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ సమావేశంలో చెప్పినట్లు మినిట్స్‌ పేర్కొంది. గోదావరి ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, 20 ఏళ్లక్రితమే చేపట్టారని కేసీఆర్‌గుర్తుచేశారు. దీనిపై ఏపీకి ఫిర్యాదు ఉంటే ట్రైబ్యునల్‌కు రాసుకోవచ్చని చెప్పారు. కృష్ణా జలాల్లో పోతిరెడ్డిపాడుకు కేటాయింపుల్లేవని, దాన్ని కొనసాగిస్తే తామూ అలంపురంవద్ద 3 టీఎంసీల ప్రాజెక్టు చేపడతామని ఆయన హెచ్చరించినట్లు మినిట్స్‌లో నమోదు చేశారు. నదీపరివాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ల మధ్య నదీజలాల బదిలీ జరగాలని గతంలో జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు కృష్ణా బేసిన్‌లో లేదని, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలు కృష్ణా బేసిన్‌లో ఉన్నాయని అన్నారు.


అదనపు నీరు తోడట్లేదు: జగన్‌

రాయలసీమ పథకం ద్వారా అదనపు నీరు ఏమీ ఉపయోగించడం లేదని, ఏపీకి కేటాయించిన జలాల్నే వాడుకుంటున్నామని.. కొత్త నిల్వలు కానీ, కొత్త ఆయ కట్టు కానీ చేపట్టడం లేదని ఏపీ సీఎం జగన్‌ రెడ్డి వాదించినట్లు మినిట్స్‌ తెలిపింది. గోదావరిపైపై తెలంగాణ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని, డీపీఆర్‌లు సమర్పించకుండా, అనుమతులు లేకుండా వాటిని చేపట్టకూడదని తెలంగాణకు చెప్పాలని జగన్‌ వాదించారు. బోర్డులు నీటివాటాను నిర్ణయించలేవని, ట్రైబ్యునళ్లు మాత్రమే ఆ పనిచేస్తాయని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఉమ్మడి రిజర్వాయర్లు అయినందువల్ల బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని  కోరారు. 

Updated Date - 2020-10-24T08:18:41+05:30 IST