డీపీఆర్‌లపై కేంద్రం స్పష్టత

ABN , First Publish Date - 2020-10-07T07:29:36+05:30 IST

తెలుగు రాష్ట్రాల నడుమ జలవివాదాల పరిష్కారం కోసం మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ

డీపీఆర్‌లపై కేంద్రం స్పష్టత

ఏయే ప్రాజెక్టులకు ఇవ్వాలో వివరణ..

పలు అంశాలపై సవివర ప్రతిపాదనలు


న్యూఢిల్లీ, అక్టోబరు 6: తెలుగు రాష్ట్రాల నడుమ జలవివాదాల పరిష్కారం కోసం మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై నిర్ణయం, రెండు రాష్ట్రాలూ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్‌) సమర్పణ, ఏపీ, తెలంగాణ నడుమ కృష్ణా, గోదావరి జలాల వాటాను నిర్ణయించే యంత్రాంగం ఏర్పాటు అంశాలపై కేంద్రం తన వైఖరిని విస్పష్టంగా వెల్లడించింది.


ముఖ్యంగా.. రెండు రాష్ట్రాలూ తాము చేపట్టినవన్నీ 2014 ముందు అనుమతులు పొందినవేనని చెబుతూ డీపీఆర్‌లు ఇవ్వడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో.. ఏవి పాతవి, వేటికి డీపీఆర్‌లు సమర్పించాలనే విషయాలపై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు, అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో చేపట్టిన అజెండా అంశాలను, వాటిపై తమ ప్రతిపాదనలను వివరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అజెండాల వారీగా కేంద్రం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తే..


కృష్ణా, గోదావరి  బోర్డుల పరిధిపై నిర్ణయం

రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లయినా.. ఈ అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అభిప్రాయభేదాలున్నందున బోర్డుల పరిధిని నోటిఫై చేయలేదు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నీటి కేటాయింపులపై ‘కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్‌-2 (కేడబ్ల్యూడీటీ-2)’ నిర్ణయం వచ్చేదాకా బోర్డుల పరిధిని నిర్ణయించకూడదని తెలంగాణ కోరుతోంది. ఇప్పుడే నిర్ణయించినా పర్వాలేదన్నది ఏపీ వాదన.


కేంద్రం ప్రతిపాదన 

బోర్డుల పరిధిని నోటిఫై చేస్తాం. ప్రస్తుతానికి అవి కేడబ్ల్యూడీటీ-1 కేటాయింపుల ఆధారంగా పనిచేస్తాయి.

కేడబ్ల్యూడీటీ-2 అవార్డు వెలువడిన తర్వాత.. బోర్డు పరిధి, దాని పనితీరు కొత్త కేటాయింపుల ఆధారంగా ఉంటుంది.


సవివర ప్రాజెక్టు నివేదికల సమర్పణ

కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలూ తలపెట్టే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను సమర్పించాలి. వాటిని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ) మదింపు చేసి నిర్ణయం తీసుకోవాలి. కానీ, రెండు రాష్ట్రాలూ ఆ పని చేయట్లేదని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. డీపీఆర్‌లు సమర్పించాలంటూ కృష్ణా, గోదావరి బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ సైతం లేఖలు రాసినా ఇరు రాష్ట్రాలూ పట్టించుకోలేదని.. తమవి పాత ప్రాజెక్టులేనని రెండు రాష్ట్రాలూ చెప్తూ వచ్చాయని వివరించింది.


కేంద్రం ప్రతిపాదన

కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్‌-1 కేటాయింపులున్న అన్ని ప్రాజెక్టులనూ పాత ప్రాజెక్టులుగా గుర్తిస్తాం. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూలు 11లో పేర్కొన్న ప్రాజెక్టులను కూడా పాత ప్రాజెక్టులుగానే పరిగణిస్తాం. అయితే.. వాటిలో ఏ ప్రాజెక్టుకైనా ట్రైబ్యునల్‌ నుంచి నీటి కేటాయింపులు లేకపోతే, ఆమేరకు కేడబ్ల్యూడీటీ-2 నుంచి కేటాయింపులను పొందేలా రాష్ట్రాలే చూసుకోవాలి. 

ట్రైబ్యునల్స్‌ నుంచి కేటాయింపులు లేని పాత ప్రాజెక్టులకు, రాష్ట్రవిభజన తర్వాత పరిధి మారిన ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక అనుమతుల నిమిత్తం బోర్డులకు డీపీఆర్‌లు తప్పనిసరిగా సమర్పించాల్సిందే. 

పై రెండు విభాగాల్లోకీ రాని ప్రాజెక్టులన్నింటినీ కొత్తవిగా పరిగణిస్తాం. వాటి డీపీఆర్‌లను సాంకేతిక అనుమతుల నిమిత్తం సంబంధిత బోర్డులకు సమర్పించాల్సిందే. అలా అనుమతులు పొందని ప్రాజెక్టులను చేపట్టడానికి వీల్లేదు.


కృష్ణా, గోదావరి జలాల వాటా తేల్చే యంత్రాంగం ఏర్పాటు


దేశంలో నదీ జలాల కేటాయింపులు ట్రైబ్యునల్స్‌ చేస్తాయి కాబట్టి.. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్రాలది పరిమిత పాత్రే. 


కేంద్రం ప్రతిపాదనలు

కృష్ణా జలాలకు సంబంధించి ప్రస్తుతం కేడబ్ల్యూడీటీ-1 కేటాయింపులు అమల్లో ఉన్నాయి. కేడబ్ల్యూడీటీ-2 కేటాయింపుల ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయి.. రాష్ట్రాల వారీగా కేటాయింపులు జరిగితే అవి వెంటనే అమల్లోకి వస్తాయి.

ఇక గోదావరి జలాల విషయానికి వస్తే.. గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్‌ రెండు రాష్ట్రాలకూ ఎలాంటి ‘ఎన్‌-బ్లాక్‌’ కేటాయింపులూ చేయలేదు. ఈ బేసిన్‌లో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను మదింపు చేయాలంటే ‘ఎన్‌-బ్లాక్‌’, ‘ప్రాజెక్టువారీ’ నీటి కేటాయింపులు తప్పనిసరి. కానీ, దీనిపై రెండు రాష్ట్రాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకూ పంచే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రెండు ప్రత్యామ్నాయాలను సూచించాం. వాటిలో మొదటి ప్రత్యామ్నాయం.. రెండు రాష్ట్రాలూ పరస్పర ఒప్పందం కుదుర్చుకోవడం  ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం. రెండో ప్రత్యామ్నాయం.. ఒక కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు.


Updated Date - 2020-10-07T07:29:36+05:30 IST