దక్షిణ మధ్య రైల్వేలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’
ABN , First Publish Date - 2020-11-13T09:28:24+05:30 IST
దక్షిణ మధ్య రైల్వేలో కృత్రిమ మేఽథ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), సమాచార విశ్లేషణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒప్పందం
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వేలో కృత్రిమ మేఽథ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), సమాచార విశ్లేషణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మధ్య ఒప్పందం కుదిరింది. భారతీయ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ వినోద్‌కుమార్ యాదవ్ సమక్షంలో సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన వర్చువల్ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిప్యూటీ డీన్ మిలింద్ సోహాన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతీయ రైల్వే అభివృద్ధిలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్’ అత్యంత ముఖ్యమైన అడుగని అన్నారు. రైల్వే ప్రయాణికులకు రిజర్వేషన్లు, సరుకు రవాణా, నిర్వహణ, అవసరమైన వనరులను సమకూర్చుకోవడం, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో డిజిటల్ బాట పట్టినట్లయిందని తెలిపారు. ఈ అంశాల్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశమేర్పడిందన్నారు.
గజానన్ మాల్య మాట్లాడుతూ సమాచార విశ్లేషణ, కృత్రిమ మేఽథ నిరంతర వినియోగానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. మిలింద్ సోహాన్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేతో కలిసి పని చేయడం గొప్ప అనుభవమని అన్నారు.