కేంద్రం కోర్టులో ‘పోతిరెడ్డిపాడు’

ABN , First Publish Date - 2020-05-17T09:08:24+05:30 IST

శ్రీశైలం జలాశయం ఆధారంగా ఏపీ సర్కారు తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ అంశం కేంద్రం కోర్టులోకి వెళ్లిపోయింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన....

కేంద్రం కోర్టులో ‘పోతిరెడ్డిపాడు’

అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ఆధారంగా ఏపీ సర్కారు తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణ అంశం కేంద్రం కోర్టులోకి వెళ్లిపోయింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన దీనిపై త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరుగనుంది. దీనికి ముందుగా ఈ వ్యవహారంపై చర్చించడానికి కృష్ణా బోర్డు సమావేశం కానుంది. పోతిరెడ్డిపాడు విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.. దీనిపై షెకావత్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి కేంద్ర మంత్రి జవాబు రాశారు. సమావేశం ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డుకు సూచించానని, అదేవిధంగా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కూడా తన కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశానని అందులో వెల్లడించారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న జీవో జారీ చేయగానే  తెలంగాణ ప్రభుత్వం 12న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనిపై బోర్డు కూడా వేగంగానే స్పందించింది. బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తూ జగన్‌ సర్కారుకు లేఖ రాసింది. రాయలసీమ పథకం ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోవడంతో.. మున్ముందు ఉన్నత స్థాయిలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-05-17T09:08:24+05:30 IST