కరోనా పరీక్షలపై కేంద్రం ఆరా

ABN , First Publish Date - 2020-05-09T09:35:51+05:30 IST

తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయడం లేదని పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో

కరోనా పరీక్షలపై కేంద్రం ఆరా

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయడం లేదని పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. శుక్రవారం కేంద్ర  ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా ఎందుకు చేస్తున్నారని కేంద్రం ప్రశ్నించింది. అయితే పరీక్షలు ఎక్కడా తక్కువగా చేయడం లేదని, పకడ్బందీ లాక్‌డౌన్‌ వల్ల కేసుల సంఖ్య తగ్గిందని మంత్రి ఈటల తెలిపారు. పది కేసులు పాజిటివ్‌ వస్తే.. వారి కాంటాక్టులు వందమందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 20 లోపే కేసుల సంఖ్య వస్తోందని, వాటి ఆధారంగానే టెస్టులు జరుపుతున్నామని వెల్లడించారు. కాగా, పాతనగరంలో పరిస్థితులపై కేంద్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అక్కడ కూడా అధికారుల సమన్వయంతో చాలా పకడ్బందీగా కట్టడి చేస్తున్నట్లు ఈటల వివరించారు. రెడ్‌జోన్‌లో పరిధిలో ఉన్న సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలుగా మార్చాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తంగా కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కేంద్ర అధికారులు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-09T09:35:51+05:30 IST