ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ సర్జరీలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-03-18T09:22:20+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌ శస్త్రచికిత్సలపైనా పడింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని(ఎలక్టివ్‌) సర్జరీలను నిలిపివేస్తున్నట్లు వైద్యాశాఖ అధికారులు ప్రకటించారు. రోజు రోజుకు కరోనా..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ సర్జరీలకు బ్రేక్‌

  • నేటి నుంచి వారంపాటు నిలిపివేతకు ఆదేశం
  • ఓపీ, అత్యవసర సర్జరీ, వైద్యసేవలు యధాతథం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : కరోనా ఎఫెక్ట్‌ శస్త్రచికిత్సలపైనా పడింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని(ఎలక్టివ్‌) సర్జరీలను నిలిపివేస్తున్నట్లు వైద్యాశాఖ అధికారులు ప్రకటించారు. రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, అనుమానితుల సంఖ్య పెరిగిపోతుండటంతో అన్ని ప్రభుత్వ, స్పెషాలిటీ ఆస్పత్రుల పరిధిలో వారంపాటు శస్త్రచికిత్సలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేయడానికి, అనుమానిత లక్షణాలున్న వారిని ఆస్పత్రుల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఎక్కడికక్కడ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌, క్వారంటైన్‌ వార్డులు సిద్ధం చేస్తుండడంతో వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తం సమయం వాటికే కేటాయించే పరిస్థితి ఏర్పడింది.


దీంతో ఎలక్టివ్‌ సర్జరీలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈనెల 18(బుధవారం) నుంచి 25 వరకు ఈ ఆదేశాలు పాటించాలని డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌, చెస్ట్‌, సరోజినీ దేవి తదితర ఆస్పత్రుల్లో వారం పాటు ఎలక్టివ్‌ సర్జరీలు జరగవు. అయితే ఔట్‌ పేషెంట్లు, అత్యవసర సేవలు, అత్యవసర సర్జరీలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. మరోవైపు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న రోగులు తమ ఆపరేషన్లను నెల, రెండు నెలల తర్వాతకు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సర్జరీలు చేయించుకునేందుకు వారు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-03-18T09:22:20+05:30 IST