పులులకు హాని కలిగిస్తే కేసులు

ABN , First Publish Date - 2020-12-03T07:28:54+05:30 IST

పెద్దపులులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

పులులకు హాని కలిగిస్తే కేసులు

అడవుల్లో వలలు ఏర్పాటు చేయరాదు.. అటవీ శాఖ హెచ్చరిక

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పెద్దపులులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం కేసులు నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అడవుల్లో ఉచ్చులు, విద్యుత్‌ తీగలు, వలలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి దాడుల్లో ఇద్దరు మరణించడంతో పాటు ఇతర జిల్లాల్లో పులుల  కదలికలపై అటవీశాఖ బుధవారం స్పందించింది. గ్రామస్తులు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను విడుదల చేసింది.


పులి సంచరించే అటవీ ప్రాంతాల పరిధిలో పశువుల కాపరులు వెళ్లకూడదని సూచించింది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే సాయంత్రం 4 గంటల్లోపు తిరిగిరావాలని పేర్కొంది. పులి కదలికలతో పాటు పాదముద్రలు కనిపిస్తే స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని వివరించింది. పులుల కదలికలను పట్టిగట్టడం, దాడులను నివారించేందుకు ప్రతి గ్రామంలో సర్పంచ్‌ అధ్యక్షతన కమిటీ వేసుకోవాలని, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీవో) అందులో సభ్యుడిగా ఉండాలని తెలిపింది.


‘‘అడవుల లోపలికి వెళ్లే వారు కచ్చితంగా కమిటీకి సమాచారం ఇవ్వాలివ్యవసాయ పనులకు కనీసం 8 నుంచి 10 మంది ఒక గుంపుగా వెళ్లాలి. ఒక వ్యక్తిని సెంట్రీగా నియమించాలి. పులులు రాకుండా డప్పు చప్పుడు, ఈలలు వేయాలి. పంటల కాపలాకు వెళ్లే రైతులు మంచెలను ఏర్పాటు చేసుకోవాలి’’ అని అటవీ శాఖ సూచించింది.


కాగా, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంచారం, మనుషులపై దాడుల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ శోభ తెలిపారు. కాగా, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామ శివారులో పత్తిచేను తీస్తున్న నిర్మలపై పెద్దపులి దాడి చేసి హతమార్చిన ఘటనపై విచారణకు పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ కమిటీని వేశారు. 


Updated Date - 2020-12-03T07:28:54+05:30 IST