బయటికొస్తే కేసు
ABN , First Publish Date - 2020-04-12T09:10:35+05:30 IST
కరోనా పాజిటివ్ కేసులు నమోదై.. కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిబంధనలు మరింత పకడ్బందీ గా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ‘మీకు పాలు, కూరగాయలు వంటి

- కంటైన్‌మెంట్ క్లస్టర్లలో నిబంధనలు కఠినం..
- సీసీ కెమెరాల నిఘా.. పోలీస్ బందోబస్తు
- ఫోన్ చేస్తే ఇంటి వద్దకు నిత్యావసరాలు..
- ఏరియాల వారీగా జోన్లు
- కరపత్రాలతో జీహెచ్‌ఎంసీ అవగాహన
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్ కేసులు నమోదై.. కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిబంధనలు మరింత పకడ్బందీ గా అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ‘మీకు పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలు కావాలంటే ఒక్క ఫోన్ చేయండి. ఇంటి ముందు అందుబాటులో ఉంచుతాం. బయటకు వస్తే మాత్రం కేసులు తప్పవు’ అంటూ ప్రభుత్వ యంతారంగం సూచిస్తోం ది. ఎవరు బయట తిరుగుతున్నారు? ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారన్నది సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తిస్తున్నారు. దీని ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తారని చెబుతున్నారు. క్లస్టర్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున నివారణ చర్యలు, సర్వేకు ఇబ్బంది లేకుండా ఏరియాల వారీగా ప్రత్యేక జోన్లను గుర్తించారు.
ఒక్కో క్లస్టర్‌లో ఐదు నుంచి పది జోన్లు
జీహెచ్‌ఎంసీ ఇటీవల 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లను ప్రకటించింది. వీటిలో వేర్వేరు బస్తీలు, కాలనీలు ఉండడం.. ఇళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో కట్టడి ఇబ్బందిగా మారుతోంది. ప్రజలూ అవస్థలు పడుతున్నారు. అధిక విస్తీర్ణంలో ఉండే క్లస్టర్ పరిధిలో ఇంటింటి సర్వే, నిత్యావసరాల సరఫరాకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విస్తీర్ణం, ఇళ్లు తక్కువగా ఉంటే నివారణ చర్యలు, నిత్యావసరాలు అం దుబాటులో ఉంచడం సులువవుతుందన్న ఉద్దేశంతో క్లస్టర్లను జోన్లుగా విభజించారు. ఏరియాల వారీగా నోడల్ అధికారిని నియమించారు. నిబంధనలతో క్లస్టర్లలో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. నోడల్ అధికారి ఫోన్ నంబరు వాటిలో ముద్రించారు.
పాటించాలి.. సహకరించాలి
క్లస్టర్లలోని ప్రజల రాకపోకలు సీసీ కెమెరాల్లో నమోదవుతాయి. కంట్రోల్ రూమ్‌కు అనుసంధానంగా ఉండే కెమెరా ఫుటేజీల ఆధారంగా వెంటనే జోన్‌లో ఉండే పోలీసులను అప్రమత్తం చేస్తారు. బయటకు వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తారు.
నిత్యావసరాలు, ఇతర అత్యవసరాల కోసం నోడల్ అధికారికి ఫోన్ చేయొచ్చు.
24 గంటల పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌నంబర్ 040-2111 1111కు ఫోన్ చేయొచ్చు.
కరోనా లక్షణాలున్నవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేసే వైద్య బృందాలకు సహకరించాలి.
అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు జోన్ల వారీగా ఒక్కో నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ఈ వివరాలను.. జోన్ల పరిధిలో పంపిణీ చేసే కరపత్రాల్లో పేర్కొంటున్నారు.
క్లస్టర్లలో కష్టాలు
ఇళ్ల నుంచి బయటకు రావద్దన్న ఆంక్షలు.. వస్తే కేసులన్న బెదిరింపులతో నిత్యావసరాల కోసం కంటైన్‌మెంట్ క్లస్టర్లలోని స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పాలు, కూరగాయలు, ఇతరత్రా నిత్యావసరాలు కావాలంటే ఫోన్ చేయం డి.. మీ ఇంటి ముందుకే పంపిస్తాం. ప్రత్యేకంగా వెండర్స్‌ను అందుబాటులో ఉంచుతున్నామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయి. ప్రాంతాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించి వారికే నిత్యాసవరాలు, ఇతర వస్తువు ల సరఫరా పర్యవేక్షణ అప్పగించామని చెబుతున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. పిల్లలు, వృద్ధులున్న ఇళ్లలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వైద్యం, ఇతరత్రా అత్యవసర పనుల కోసం మాత్రం కొన్నిచోట్ల మినహాయింపునిస్తున్నారు.