వృద్ధులు జాగ్రత్త !

ABN , First Publish Date - 2020-04-18T08:53:22+05:30 IST

కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని వృద్ధుల పట్ల పత్ర్యేక రక్షణ చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.

వృద్ధులు జాగ్రత్త !

కరోనా ప్రభావం వారిపై ఎక్కువగా ఉంది..

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి..

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని వృద్ధుల పట్ల పత్ర్యేక రక్షణ చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా వైర్‌సను వృద్ధులు తట్టుకోలేరని, వారు వైరస్‌ బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి ఆర్‌.సుబ్రమణ్యం ప్రత్యేక లేఖ రాశారు. వృద్ధులను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై పలు సూచనలు చేశారు. సీనియర్‌ సిటిజన్ల కోసం పనిచేస్తున్న ఎన్‌జీవోలతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని, ముఖ్యంగా వృద్ధుల్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శ్వాస సంబంధమైన ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించాలని, గుండె, కిడ్నీ, కాలేయ, వైరల్‌ హెపటైటిస్‌, ఆల్కహాలిక్‌, హైపర్‌టెన్షన్‌, కేన్సర్‌, డయాబెటిస్‌ వంటి వ్యాధులు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి నేపథ్యంలో మంచినీరు వంటి వసతులు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.


వృద్ధుల సంరక్షణకు చేయాల్సిన పనులు..

వృద్ధులను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూడాలి. వారు ఉండే ఇంటికి విజిటర్స్‌ను అనుమతించవద్దు. తప్పనిసరైతే.. ఒక మీటరు దూరం నిబంధనను పాటించాలి. ఒంటరిగా ఉండే వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాలి. సమూహాలను గుమిగూడనివ్వొద్దు.


వృద్ధుల వద్ద ఎప్పడూ ఫోన్‌ అందుబాటులో ఉంచాలి. యోగా, ఇతర ఎక్సైర్‌సైజులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడానికి వీలుగా శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచాలి. కళ్లజోడు వంటి వాటిని శుభ్రంగా ఉంచాలి.


దగ్గు, తుమ్ములు వంటివి వచ్చినప్పుడు టిష్యూలను ఉపయోగించేలా చూడాలి. పోషక విలువులు గల ఆహారం, ఇతర పండ్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. కుటుంబసభ్యులతో మాట్లాడే సదుపాయం కల్పించాలి. వృద్ధులకు సహాయంగా ఉండేవారు ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలి.


   చేయకూడని పనులు..


వైరస్‌ లక్షణాలు ఉన్నవారు వృద్ధుల వద్దకు వెళ్లకూడదు. షేక్‌హ్యాండ్స్‌, హగ్‌ వంటి వాటిని ఆపాలి.

పార్కులు, మత సంబంధ ప్రాంతాలు, ఇతర జనంలోకి వెళ్లనీయవద్దు.

దగ్గు, జలుబు ఉన్నట్లయితే.. చేతులను ముక్కు, కళ్ల వద్ద తాకనీయవద్దు.

రెగ్యులర్‌ చెకప్‌ల కోసం ఆస్పత్రులకు తీసుకెళ్లాలి.

డాక్టర్‌ సూచనలు లేకుండా సొంతంగా మెడిసిన్‌ వేసుకోరాదు.

స్నేహితులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించకూడదు.



Updated Date - 2020-04-18T08:53:22+05:30 IST