కరోనా... చికిత్సకు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తోన్న ఆసుపత్రులు

ABN , First Publish Date - 2020-06-23T21:35:25+05:30 IST

కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకు, ఈ ఆసుపత్రులు వసూలు చేస్తున్న ధరలకు పొంతనే లేకుండా పోతోంది. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు ప్యాకేజీల పేరుతో ఎందుకు లక్షలకు లక్షలు లాగేస్తున్నాయి. కరోనా నేపధ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

కరోనా... చికిత్సకు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తోన్న ఆసుపత్రులు

హైదరాబాద్ : కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకు, ఈ ఆసుపత్రులు వసూలు చేస్తున్న ధరలకు పొంతనే లేకుండా పోతోంది. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు ప్యాకేజీల పేరుతో ఎందుకు లక్షలకు లక్షలు లాగేస్తున్నాయి. కరోనా నేపధ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.


అదే సమయంలో... అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదంటూ... కొన్ని నిర్ణీత ధరలతో ప్యాకేజీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవి ఎక్కడా అమల్లో కనిపించట్లేదు. చాలా ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్న ఛార్జీలకూ, ప్రభుత్వం చెప్పిన ఛార్జీలకూ ఎక్కడా పొంతన అన్నదే లేదంటున్నారు బాధితులు.


ప్రభుత్వాసుపత్రులు ఖాళీ లేకపోవడంతో... చాలా మంది కరోనా బాధితులు... ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు. కానీ ఆ ఆస్పత్రుల సిబ్బంది చెప్పే ధరలు విని బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు టెస్టుకు ఇంత, వెంటిలేటర్ అయితే ఇంత అనే విధానమే చాలా ఆస్పత్రుల్లో కనిపించట్లేదు. దానికి బదులుగా... రకరకాల ప్యాకేజీలు చెబుతున్నారు. ఇన్ని రోజులకు ఓ ప్యాకేజీ అని ఏక మొత్తంగా ఛార్జీలు చెబుతున్నారు. ఆ వంకతో లక్షలు లాగేస్తున్నారన్న ఆరోపణలకు కొదవే లేదు.


హోం క్వారంటైన్ అయిన వారికి సేవలు అందించడానికి ఓ ఆస్పత్రి రూ. 20 వేలు వసూలు చేస్తోంది. ఇందులో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, ఆక్సిజ‌న్, రోజు విడిచి రోజు డాక్టర్‌తో మాట్లాడే సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత... పదిహేను రోజుల చికిత్సకుగాను రూ. 14 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. అంత డబ్బు ఇవ్వలేనిపక్షంలో... హోం క్వారంటైన్ అవ్వండంటూ... వదిలించుకుంటున్నాయి.


ఈ నిలువు దోపిడీకి ప్రభుత్వం చెక్ పెట్టకపోవడంతో... బాధితులు లబోదిబోమంటున్నారు. కరోనా సోకుతున్న వారిలో చాలా మంది నిరుపేదలే ఉంటున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారమైతే... ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా టెస్టులకు రూ. 2,200 తీసుకోవాలి. వెంటిలేటర్ లేకుండా చికిత్స చేస్తే రోజుకు రూ. 7,500, వెంటిలేటర్ ద్వారా చికిత్సనందిస్తు... రూ.9 వేలు చొప్పున ఛార్జీలను వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ మాత్రం ఇవ్వడమే పేద బాధితులకు చాలా కష్టం. కానీ ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రం ఈ పరిస్థితి కనిపించడంలేదు. 


Updated Date - 2020-06-23T21:35:25+05:30 IST