ఆర్టీసీకి ‘కార్గో’ బాసట
ABN , First Publish Date - 2020-10-21T10:27:24+05:30 IST
కరోనా కష్టకాలంలో అరకొర రాబడితో, వేతనాలు చెల్లించలేని దైన్య స్థితిని ఎదుర్కొంటున్న..

రోజువారీ రాబడి రూ.10-11 లక్షలు
రూ.20 లక్షల లక్ష్యంతో మరిన్ని సేవలు
హైదరాబాద్, అక్టోబరు20 (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో అరకొర రాబడితో, వేతనాలు చెల్లించలేని దైన్య స్థితిని ఎదుర్కొంటున్న ఆర్టీసీని ‘పార్శిల్, కార్గో, కొరియర్(పీసీసీ)’సేవలు ఆదుకుంటున్నాయి. రోజుకు రూ. 10-11 లక్షల రాబడిని సాధిస్తూ సహాయకారిగా నిలస్తున్నాయి. ప్రైవేటు కొరియర్, పార్శి ల్ సేవలకు ధీటుగా ఆర్టీసీ కార్గో సర్వీసులు కొనసాగుతున్నాయి. మొద ట్లో రూ.15-20 వేల మేర రోజువారి రాబడి వచ్చేది. దాంతో ఆర్టీసీలోనే చాలా మంది పెదవి విరిచారు. కానీ.. ఇప్పుడిప్పుడే పరిస్థితిగాడిలో పడుతోంది. నిజానికి ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. 2019 సంవత్సరంలో ఉద్యోగుల సమ్మె కారణంగా దాదాపు రూ.1000 కోట్ల వరకు నష్టాలను చవి చూసింది. ఈ సంవత్సరం మార్చి నుంచి కొనసాగిన కరోనా లాక్‌డౌన్‌తో మరో రూ.800 కోట్ల వరకు నష్టపోయింది. దీంతో ప్రస్తుతం వేతనా లు ఇవ్వలేని పరిస్థితికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రారంభించిన కార్గో, పార్శిల్, కొరియర్ సేవలు కొంతమేర ఆదుకుంటున్నాయి.
నెలకు రూ.3 కోట్లకు పైగానే రాబడి సమకూరుతోంది. ఆర్టీసీలో మొత్తం 354 బస్టాండ్లుగా ఉండగా.. వీటిలో ఎంపిక చేసిన 147 ప్రధాన బస్స్టేషన్ల నుంచి కార్గో, పార్శిల్ సేవలను అందిస్తున్నారు. వీటికి తోడుగా.. 580 ప్రైవే టు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుని, వారి ద్వారా సర్వీసులను బుక్ చే యించుకుంటున్నారు. పెద్ద బస్సుల్లో 8 టన్నులు, చిన్న బస్సుల్లో 4 టన్ను ల మేర సరుకులను చేరవేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ సేవలకూ ఆర్టీసీ సిద్ధమైంది. 50 కిలోమీటర్లలోపు దూరానికి రూ. 4,420 చొప్పున చార్జీ చేస్తోంది. ప్రైవేటు సేవలతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ.
మున్ముందు మరిన్ని సేవలు..
భవిష్యత్తులో సేవలను విస్తరించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా రు. ఇప్పటికే రైల్వే అధికారులు, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు ప్రారంభించారు. రైల్వే అధికారులతో కూడా ఒప్పందం చేసుకు ని వారి సరుకులను జిల్లాలకు చేరవేయాలని యోచిస్తున్నారు. ఇవే కాకుండా ముగ్గురు, నలుగురు రైతులు కలిసి కూరగాయలను మార్కెట్లకు తరలించుకుంటామని భావిస్తే.. అలాంటివారికి కూడా సేవలను అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే హకీంపేట డిపో అధికారులు ఇలాంటి ప్రయత్నాలను మొదలు పెట్టారు.
ఏపీకి బస్సులు ప్రారంభమైతే రాబడి పెరుగుతుంది.. కృష్ణకాంత్, పీసీసీ సేవల ప్రత్యేకాధికారి
అంతర్రాష్ట్ర బస్సులు కూడా పరిమితంగా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా బస్సులు ప్రారంభం కాలేదు. ఈ బస్సులు ప్రారంభమైతే కార్గో సేవలు పెరుగుతాయి. హైదరాబాద్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఏపీ జిల్లాలకు పెద్ద మొత్తంలో స్టడీ మెటిరియల్స్‌ను తరలించే అవకాశముంటుంది. వీటితోపాటు ఇతర సరుకుల చేరవేత కాంట్రాక్టులపై వివిధ సంస్థలతో చర్చిస్తున్నాం.