‘కంటోన్మెంట్‌లో అవినీతి.. అంతర్గత విచారణ’

ABN , First Publish Date - 2020-12-10T16:30:14+05:30 IST

కంటోన్మెంట్‌ పరిధిలో అధికార దుర్వినియోగం

‘కంటోన్మెంట్‌లో అవినీతి.. అంతర్గత విచారణ’

హైదరాబాద్/సికింద్రాబాద్‌ : కంటోన్మెంట్‌ పరిధిలో అధికార దుర్వినియోగం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఇద్దరు బోర్డు సభ్యులపై అంతర్గత విచారణ జరుగుతోందని, వారిపై చర్యలు తప్పవని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు, 5వ వార్డు సభ్యుడు జె.   రామకృష్ణ అన్నారు. ఇద్దరు సభ్యుల్లో ఒకరిపై అనర్హత వేటు ఖాయమని, మరొకరిపై చర్యలు ఖాయమని ఆయన పేర్కొన్నారు.  ఆ ఇద్దరు సభ్యుల కారణంగా బోర్డు పాలక మండలిని కూడా రద్దు చేసే దిశగా రక్షణ శాఖ ఆలోచిస్తున్నదని, నామినేటెడ్‌ సభ్యుడ్ని నియమించే యోచనలో ఉన్నదని రామకృష్ణ వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపద్‌ నాయక్‌ను కలిసి బుధవారం నగరానికి విచ్చేసిన రామకృష్ణ కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.


తనపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా చట్టరీత్యా చెల్లదని, ఐదేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మొత్తం 8 మంది బోర్డు సభ్యులకు 6 నెలల చొప్పున రెండు సార్లు పదవీ కాలం పొడిగింపు లభించిందని, దీనిని నామినేట్‌ ప్రక్రియగా పరిగణించవలసి ఉంటుందని, అందుకే ఈ అవిశ్వాస తీర్మానం చెల్లదన్నారు. దీనిపై కూడా త్వరలోనే రక్షణశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రానున్నాయని చెప్పారు. కంటోన్మెంట్‌ సమగ్రాభివృద్ధికి తాను చేసిన విజ్ఞప్తులకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Updated Date - 2020-12-10T16:30:14+05:30 IST