ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తయ్యాకే ఖాళీ స్థలాల లెక్క

ABN , First Publish Date - 2020-10-04T07:53:55+05:30 IST

హైదరాబాద్‌లో ఉండే ఓ వ్యక్తికి ఒక ఫ్లాటు ఉంది. మరో చోట ఖాళీ స్థలం (ప్లాటు) ఉంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ పూర్తయ్యాకే ఖాళీ స్థలాల లెక్క

ఖరారు కాని విధి విధానాలు..ప్రస్తుతానికైతే ఇళ్ల వివరాల సేకరణే

స్పష్టత లేక క్షేత్రస్థాయిలో గందరగోళం

ఆస్తుల నమోదులో మరో వెసులుబాటు

నిన్నటి దాకా పీటీఐ నంబర్‌ ఉన్నవే లెక్కలోకి

ఇప్పుడు రేషన్‌ లేదా ఆధార్‌ నంబర్‌ ఉన్నా చాలు

సంబంధిత యాప్‌లోని ‘యాడ్‌ ఆప్షన్‌’లో నమోదు

రోజంతా సర్వే చేసినా ఇచ్చేది రూ. 250 మాత్రమే

తాజాగా రేషన్‌ లేదా ఆధార్‌ నంబర్‌తోనూ నమోదు


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఉండే ఓ వ్యక్తికి ఒక ఫ్లాటు ఉంది. మరో చోట ఖాళీ స్థలం (ప్లాటు) ఉంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదులో భాగంగా నివాసం ఉంటున్న ఫ్లాటుతోపాటు ఖాళీ స్థలాన్ని నమోదు చేయించాలని ఆయన భావించగా.. కేవలం ఫ్లాటు వివరాలను మాత్రమే తీసుకొని సర్వే సిబ్బంది వెనుతిరిగారు. అదేమిటని ప్రశ్నిస్తే వారు ఏమీ చెప్పలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో క్షేత్ర స్థాయిలో గందరగోళం నెలకొంది. వ్యవసాయేతర ఆస్తుల సమాచార సేకరణలో భాగంగా ప్రతి ఇల్లు, వ్యవసాయ భావి వద్ద ఉన్న ఇల్లు అయినా సరే.. నమోదు చేసుకోవాల్సిందేనని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాలతో పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలు రంగంలోకి దిగాయి. ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్ను కట్టేందుకు వీలుగా స్థానిక సంస్థలు కేటాయించే పీటీఐ నంబర్‌ ఆధారంగా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సర్వేకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా అలాగే రూపొందించారు. ఈ కారణంగానేప్రస్తుతానికి ఖాళీ స్థలాలను నమోదుకు అవకాశం లేకుండా పోయింది.


ఇళ్ల వివరాలన్నీ రిజిస్ట్రేషన్‌ శాఖతోపాటు స్థానిక సంస్థల వద్ద ఉండగా.. మళ్లీ సర్వే ఎందుకు చేస్తున్నారో తెలియక చాలా మంది ఇంటి యజమానులు తికమకపడుతున్నారు. కష్టపడి కొనుక్కున్న ప్లాటు(ఖాళీ జాగా)ను నమోదు చేసుకోకపోతే ఏమవుతుందోనన్న ఆందోళన.. వారిలో వ్యక్తమవుతోంది. అయితే ఖాళీ స్థలాల లెక్క ఇపుడు కాదని, ప్రస్తుత సర్వే ఇళ్లకే పరిమితమని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆస్తి పన్ను నంబర్‌ను తప్పనిసరి చేయడం ఇందుకు నిదర్శనమని ఆవర్గాలు స్పష్టం చేశాయి. ఇళ్ల వివరాల సేకరణ పూర్తయ్యేసరికి ఎల్‌ఆర్‌ఎ్‌సపై ఒక స్పష్టత రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాతే చట్టబద్ధ లేఅవుట్లలో ప్లాట్ల వివరాల సేకరణ మొదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. 


మూడింట్లో ఏ ఒక్కటి ఉన్నా ఓకే

ఇళ్ల సర్వేకు ఈనెల 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. నిర్దేశిత సమయంలో లక్షల ఇళ్ల వివరాలను సేకరించడం కష్టమనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఎవరికి వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, మొన్నటి వరకూ కరెంట్‌ కనెక్షన్‌, పీటీఐ నంబర్‌ ఉంటేనే ఆస్తుల నమోదుకు అంగీకరించగా, శనివారం నుంచి ఆధార్‌ కార్డు లేదా రేషన్‌ కార్డు నంబర్‌ ఉన్నా వివరాలు నమోదు చేస్తున్నారు. సంబంధిత యాప్‌లోని యాడ్‌ ఆప్షన్‌లో ఈ వివరాలతో నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, స్థానికంగా అందుబాటులో లేని యజమానుల ఆస్తుల వద్దకు క్షేత్ర స్థాయి సిబ్బంది వెళ్లినప్పుడు.. వీడియో కాల్‌ ద్వారా యజమాని ఫొటో క్యాప్చర్‌ చేయాల్సి ఉండగా.. సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ ఆస్తులు ఉండి విదేశాల్లో ఉన్న వారి ఫొటోలను క్యాప్చర్‌ చేయడం, ఆస్తుల వివరాలు రాబట్టడం కష్టతరమవుతోందని సిబ్బంది చెబుతున్నారు. వీడియో కాల్‌ చేసినా కొందరు స్పందించడం లేదని వాపోతున్నారు.


కాగా గ్రామాల్లో ఇళ్లను సర్వే చేస్తున్న కార్యదర్శులకు ఒక్కో ఇంటి వివరాలు సేకరించినందుకు రూ.5ఇస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం. తమ స్మార్ట్‌ఫోన్‌తోపాటు డేటాను వినియోగిస్తున్నా.. ఇంత తక్కువ రుసుం ఇవ్వడంపై వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక, హైదరాబాద్‌లో సర్వే చేస్తున్న సిబ్బందికి ఒక్కో ఇంటికి రూ.13చొప్పున ఇస్తున్నట్లు తెలిసింది. రోజుకు 20 ఇళ్లు కూడా నమోదు చేయలేకపోతున్నామని, రూ.250కూడా రావడం లేదని సర్వే చేస్తున్న ఓ వ్యక్తి వాపోయారు. 


యజమాని ఫొటో, ఆధార్‌, జియో రిఫరెన్స్‌ కూడా..

నమూనా సిద్ధం

మార్పులు, చేర్పులతో తుది రూపు

బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ తో పాసు పుస్తకం




బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌తో వ్యవసాయేతర ఆస్తుల పట్టాదారు పాస్‌పుస్తకాలు సిద్ధం కానున్నాయి. ఈ మేరకు రూపొందించిన నమూనా పాసు పుస్తకాన్ని శనివారం విడుదల చేశారు. వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ రంగు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే. ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయాక.. ధరణి వెబ్‌సైట్‌లో వీటిని పొందుపర్చిన తదుపరి యజమానులకు మెరూన్‌ కలర్‌ పాసు పుస్తకాలు జారీ చేస్తారు. తాజాగా విడుదల చేసిన నమూనా పాసు పుస్తకంలో ప్రధానంగా బార్‌ కోడ్‌తో పాటు క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంది.


వీటిని స్కాన్‌ చేయడం ద్వారా యజమాని ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. మొదటి పేజీలో యజమాని ఫొటో రెండు వైపులా ఉంది. దాంతో పాటు ఆధార్‌ నంబర్‌, చిరునామా, మొబైల్‌ నంబర్‌, పిన్‌ నంబర్‌ వివరాలు ఉన్నాయి. వెనుక పేజీలో జియో రెఫరెన్స్‌ పాయింట్‌ సహా ఆస్తుల వివరాలు ఉన్నాయి. ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను నంబర్‌తోపాటు ఆస్తి స్వభావం వివరాలు పొందుపర్చారు. అవసరమైన పక్షంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి పాసు పుస్తకాలకు తుది రూపు తీసుకురానున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-10-04T07:53:55+05:30 IST