బై..బై.. గణేషా..

ABN , First Publish Date - 2020-09-01T10:17:21+05:30 IST

అంగరంగ వైభవంగా నిర్వహించుకొనే గణపతి నిమజ్జనం కోవిడ్‌ -19 నిబంధనలతో సాదాసీదాగా సాగింది.

బై..బై.. గణేషా..

కరోనా ఎఫెక్ట్‌తో సాదాసీదాగా నిమజ్జనం


వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, ఆగస్టు 31: అంగరంగ వైభవంగా నిర్వహించుకొనే గణపతి నిమజ్జనం కోవిడ్‌ -19 నిబంధనలతో సాదాసీదాగా సాగింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం భక్తి శ్రద్ధలతో మండపాల నుంచి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు. ఊరేగింపులో డీ జే సౌండ్స్‌, డప్పుచప్పుళ్లు, నాట్యాలు, ఆటలు, పాటలను పోలీసులు అనుమతించలేదు. డివిజన్‌ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వినాయక విగ్రహాలను చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేశారు. భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చిన్న మట్టి గణపతులను తయారు చేసి కోవిడ్‌ -19 నిబంధనలకు అనుగుణంగా అర్చకులతో సంబంధిత వినాయక ఉత్సవాల కమిటీలు తమ గృహాల్లోనే వినాయకులను ఏర్పాటు చేసి తొమ్మిది రోజు పూజలు నిర్వహించారు. 

నర్సంపేట: నర్సంపేట మునసిపాలిటి పరిధిలోని నర్సంపేట, ద్వారకపేట, సర్వాపురం వల్లబ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన గణపతి విగ్రహాలనునర్సంపేట సమీపంలోని దామెరచెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమాన్ని మునిసిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, సీఐ సురేశ్‌బాబులు ప్రారంభించారు. ఆర్డీవో పవన్‌కుమార్‌, ఏసీపీ ఫణీందర్‌ పర్యవేక్షించారు. 

 పరకాల: పరకాలలో గణేషుడి నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, టాటాఏసీలను అందంగా ముస్తాబు చేశారు.

 వర్ధన్నపేట : తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాఽథుడు సోమవారం గంగమ్మ వడికి చేరాడు. వర్ధన్నపేటతోపాటు పలు గ్రామాల్లో వివిధ వాహనాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం తరలించారు.


గంగమ్మ చెంతకు గణపయ్య
జిల్లాలో ఘనంగా గణేశ్‌ నిమజ్జనం

జనగామ కల్చరల్‌, ఆగస్టు 31: నవ రాత్రులు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. జనగామ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుల నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. కొవిడ్‌-19 కారణంగా అక్కడక్కడ చిన్న వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించగా, కొంత మంది ఇళ్లలోనే నెలకొల్పుకుని పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అధికారికంగా నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేయనప్పటికీ పట్టణంలోని రంగప్ప చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని మునిసిపల్‌ అధికారులు కోరారు.

ఒక తెప్పను తయారు చేసి కొంత మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. దీంతో గణపతి బొప్పా మోరియా అంటూ భక్తులు తీసుకొచ్చిన బొజ్జ గణపయ్యలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి గంగమ్మ చెంతకు చేర్చారు. ఏసీపీ బి.వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌లో గణపతి నిమజ్జన కార్యక్రమం సోమవారం నిరాడంబరంగా జరిగింది. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ నిమజ్జనోత్సవం నిర్వహించారు. స్థానికంగా ఓ యువకుడు బుల్లెట్‌ వాహనంపై రథం ఏర్పాటు చేసుకుని గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లడం ఆకట్టుకుంది.

Updated Date - 2020-09-01T10:17:21+05:30 IST