ఏపీకి బస్సులు రయ్‌.. రయ్‌

ABN , First Publish Date - 2020-11-03T07:59:28+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సుల సమస్య కొలిక్కి వచ్చింది. ఎవరు ఎన్ని బస్సులు నడపాలి,

ఏపీకి బస్సులు రయ్‌.. రయ్‌

రెండు ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం..

టీఎస్‌ఆర్టీసీ ఏపీలో నడిపే బస్సులు 826

1,61,258 కిలోమీటర్ల మేర ప్రయాణం

తెలంగాణలో ఏపీఎ్‌సఆర్టీసీవి 638 బస్సులు

1,60,999 కిలోమీటర్ల మేర ప్రయాణం

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సుల సమస్య కొలిక్కి వచ్చింది. ఎవరు ఎన్ని బస్సులు నడపాలి, ఎన్ని కిలోమీటర్లు నడపాలన్న స్పష్టత వచ్చింది. ఈమేరకు రెండు ఆర్టీసీ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం(ఎంయూ) కుదిరింది. సోమవారం ఈ ఎంవోయూపై టీఎ్‌సఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఏపీఎ్‌సఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు సంతకాలు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.


దీంతో సోమవారం సాయంత్రం నుంచే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అక్కడి నుంచి తెలంగాణకు బస్సులు పరుగులు తీశాయి.  సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి కర్నూలుకు, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తొలి సర్వీసులు ప్రారంభమయ్యాయి. కుదిరిన ఒప్పందం ప్రకారం ఇకపై ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణలో 1,60,999 కిలోమీటర్ల మేర 638 బస్సులను తిప్పనుంది. తెలంగాణ.. ఏపీలో 1,61,258 కిలో మీటర్ల మేర 826 బస్సులను నడపనుంది. సమన్యాయం ప్రాతిపదికన ఈ ఒప్పందం కుదిరింది. తెలంగాణ డిమాండ్‌ మేరకు ఏపీఎ్‌సఆర్టీసీ.. తెలంగాణలో తాను నడిపేకిలోమీటర్లను తగ్గించుకుంది.


అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇన్నాళ్లుగా ప్రత్యేకంగా ఒప్పందమంటూ ఏదీ లేదు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలోని ఒప్పందం ప్రకారమే టీఎ్‌సఆర్టీసీ పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడుపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు ఆర్టీసీలు విడివిడిగా బస్సులను ఆపరేట్‌ చేస్తుండడంతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ ఇందుకు సహకరించినట్లయింది. ఇరు రాష్ట్రాల నడుమ ఆర్టీసీ బస్సుల రాకపోకలు లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి నిలిచిపోయాయి. కేంద్ర హోంశాఖ కల్పించిన అన్‌లాక్‌ సౌకర్యాలతో అంతర్రాష్ట్ర రవాణాకు మార్గం సుగమమైంది.


ఈ నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపే అంశం చర్చకు వచ్చింది. ఇదే అంశంపై నాలుగుసార్లు ఇరు సంస్థల అధికారుల మధ్య చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు 2 రాష్ట్రాలూ 1.60 లక్షల కిలోమీటర్లకు ఒప్పుకోవడంతో మార్గం సుగమమైంది.  


మిగతా లక్ష కిలోమీటర్లపై..

లాక్‌డౌన్‌కు ముందు ఏపీ బస్సులు తెలంగాణలో 2.64 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ బస్సులు ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్లు తిరిగేవి. అంటే దాదాపు 4.20 లక్షల కిలోమీటర్లకు పైగా రెండు రాష్ట్రాల బస్సులు నడిచేవి. కానీ.. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య 3.20 లక్షల కిలో మీటర్లకే ఒప్పందం కుదిరింది.

కరోనా భయాందోళనలు తగ్గి, ప్రయాణికుల ఆదరణ పెరిగితే మిగతా లక్ష కిలోమీటర్లపైనా ఒప్పందం చేసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవా ణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, ఆర్టీసీ ఈడీలు యాదగిరి, పురుషోత్తం, వినోద్‌, వెంకటేశ్వర్లు, ఏపీఎ్‌సఆర్టీసీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


చార్జీలు పెంచట్లేదు: పువ్వాడ

ఏపీకి బస్సులను ప్రారంభిస్తున్నందున.. టీఎ్‌సఆర్టీసీ బస్సులకు చార్జీలు పెంచట్లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రెండు ఆర్టీసీ సంస్థలు విజయం సాధించినట్లుగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఒప్పందం జరిగిందని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా టీఎ్‌సఆర్టీసీ రూ.2000 కోట్ల మేర రాబడి నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఆర్టీసీ గాడిన పడుతుందని, రోజుకు రూ.7 కోట్ల రాబడి వస్తుందని చెప్పారు.


ఇక ప్రైవేటు వాహనాలపై దృష్టి

అంతర్రాష్ట్ర బస్సులపై ఐదేళ్లకోసారి ఒప్పందం జరగాల్సి ఉంది. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేదు. ఇప్పడు సమగ్ర ఒప్పందం చేసుకున్నాం. మిగతా లక్ష కిలోమీటర్లను కూడా సమన్యాయం ప్రాతిపదికన ఖరారు చేస్తాం. ఆర్టీసీ సమస్య కొలిక్కి వచ్చినందున... ఇక ప్రైవేటు లారీలు, ఇతర వాహనాలపై దృష్టి పెడతాం.  

- ఎంటీ కృష్ణబాబు, ఏపీఎ్‌సఆర్టీసీ ఎండీ


Updated Date - 2020-11-03T07:59:28+05:30 IST