కేంద్రం నిధులేవి?

ABN , First Publish Date - 2020-12-26T07:11:00+05:30 IST

ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1024 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టగా..

కేంద్రం నిధులేవి?

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను నిలదీసేందుకు 

టీఆర్‌ఎస్‌ సర్పంచుల యత్నం

జగిత్యాలలో  ఆయన వచ్చే దారిలోనే నిరసన

రెండు పార్టీల నాయకులు తరలిరావడంతో ఉద్రిక్తత

సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌ 

పోలీసు బలగాల మోహరింపు.. సర్పంచుల అరెస్టు

జగిత్యాల ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ గృహనిర్బంధం

మాపై దాడిచేస్తే ప్రతిదాడి తప్పదు

ఒక్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా బయట తిరగలేరు

బండి సంజయ్‌ హెచ్చరిక


జగిత్యాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1024 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టగా.. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటించడం, ఆయన వెళ్లే మార్గంలోనే సర్పంచుల నిరసన శిబిరం ఉండడం.. కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రాజకీయ వేడిని రాజేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బండి సంజయ్‌ అక్కడికి రాకముందే సర్పంచ్‌లను అదుపులోకి తీసుకుని తరలించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలంటూ జగిత్యాల కలెక్టరేట్‌ వద్ద టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు భారీ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వెలిబుచ్చారు. అయితే, అదే సమయంలో నూతన వ్యవసాయ చట్టాలపై నిర్వహించనున్న అవగాహన సదస్సులో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జగిత్యాల వచ్చారు.


ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ బైక్‌ ర్యాలీ చేపట్టేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఈ రెండు కార్యక్రమాలు సమీపంలోనే ఉండడం పోలీసులకు సమస్యగా మారింది. ఇరు పార్టీల నాయకులు భారీగా తరలి రావడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బండి సంజయ్‌ను నిలదీసేందుకు సర్పంచుల ప్రయత్నించే అవకాశం ఉందన్న సమాచారంతో జిల్లా ఎస్పీ సింధూ శర్మ వెంటనే స్పందించి పోలీసు బలగాలను భారీగా మోహరించారు. నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులను అదుపులోకి తీసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వీరికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతను గృహ నిర్బంధంలో ఉంచారు. బీజేపీ నేత బండి సంజయ్‌ పాల్గొన్న సదస్సు ప్రాంతంతోపాటు ఎమ్మెల్యే సంజయ్‌ క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


రహ్మత్‌నగర్‌లో బీజేపీ శ్రేణుల బాహాబాహి

బంజారాహిల్స్‌: హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో రహ్మత్‌నగర్‌ డివిజన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొలను వెంకటే్‌ష, సోమాజిగూడ డివిజన్‌ అభ్యర్థి భర్త సందీ్‌పయాదవ్‌  వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తనపై దాడి చేశారంటూ వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


టీఆర్‌ఎస్‌ తీరు అప్రజాస్వామికం

జగిత్యాలలో బీజేపీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. దమ్ముంటే సంఘ విద్రోహ శక్తులైన నిషేదిత సంస్థల సభ్యుల పర్యటనలను అడ్డుకోవాలని సవాల్‌ విసిరారు. జగిత్యాలలో వ్యవసాయ చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుతోపాటు వాజ్‌పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, రేపటి నుంచి రాష్ట్రంలో ఒక్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా బయట తిరగలేరని హెచ్చరించారు. తమపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేసే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం వచ్చాక మౌనంగా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతుంటే, సీఎం కేసీఆర్‌ మాత్రం ఫాంహౌ్‌సలో జల్సా చేస్తున్నారని దుయ్యబట్టారు.

Updated Date - 2020-12-26T07:11:00+05:30 IST