కేసీఆర్ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST
సీఆర్ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి అని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో మాయలు చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: కేసీఆర్ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి అని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో మాయలు చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే.. బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచేదని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని తక్కువ అంచనా వేసిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. సీఎం తీరును మార్చుకోకుంటే ప్రజా ఉద్యమాలు చేస్తామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారని చెప్పారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ కార్పొరేటర్లతో కలసి భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్తానని అన్నారు. 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
సోమవారం పార్టీలోకి విజయశాంతి
విజయశాంతి పలుమార్లు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె చేరడానికి ముహుర్తం ఖరారు కాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు రోజునే చేరతారని అంతా భావించిన్పటికీ చేరలేదు. అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పటికీ ఆయా కారణాల రీత్యా పార్టీలో చేరలేదని సమాచారం. సోమవారం ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి చేరేందుకు లాంచనంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని బండి సంజయ్ తెలిపారు.
దుబ్బాక ఫలితం తర్వాత కేసీఆర్‌కు భయం పట్టుకుంది...
దుబ్బాక ఫలితం తర్వాత కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. పథకం ప్రకారమే గ్రేటర్ ఎన్నికలను హడావుడిగా నిర్వహించారని దుయ్యబట్టారు. అభ్యర్థులను ఖరారు చేసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. అక్రమాలకు నిదర్శనం టీఆర్ఎస్ అని, ఏడేళ్లుగా ప్రజలను మభ్యపెడుతు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల పాచీకలు పారలేదన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
రిగ్గింగ్ కోసమే బ్యాలెట్ పేపర్లు..
కేంద్రం నిధుల విషయంలో హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. పార్టీ అధిష్ఠానం భూపేందర్ యాదవ్‌ను ఇన్చార్జ్గా నియమించినప్పుడే మాకు గెలుస్తామన్న నమ్మకం కలిగిందని చెప్పారు. డీజీపీ, ఎన్నికల సంఘం, ఎంఐఎం టీఆర్ఎస్ ... అందరూ ఒక్కటేనని అంతా టీఆర్ఎస్కు అనుగుణంగా పని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు డివిజన్లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలకు బీజేపీని విమర్శించే అర్హత లేదని ఎద్దేవా చేశారు. వరదసాయం డబ్బులనే టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల్లో పంచారని ఆరోపించారు. రిగ్గింగ్ కోసమే బ్యాలెట్ పేపర్లు పెట్టారని మండిపడ్డారు. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కారని ఆక్షేపించారు. ఇతర గుర్తులపై అర్థరాత్రి సర్క్యులర్ ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.