అవాస్తవిక బడ్జెట్‌!

ABN , First Publish Date - 2020-03-08T09:59:07+05:30 IST

గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ఆరు నెలల కాలానికి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 10వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్‌ అసెంబ్లీకి

అవాస్తవిక బడ్జెట్‌!

బడ్జెట్‌ 1.50 లక్షల కోట్లు!


నేడు 11.30 కు ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌

కేటాయింపులు ఘనం

ఖర్చు మాత్రం పరిమితం

కొన్ని పథకాలకు శూన్యం

అమల్లోకి రాని పథకాలు

గత బడ్జెట్‌ అమలు తీరిది


 రైతు బంధు రూ.కోట్లలో

కేటాయింపు 12,300 

విడుదల  10,552


‘ఇది వాస్తవిక బడ్జెట్‌’.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ప్రభుత్వం చెప్పే మాట ఇది! వాస్తవాలకు అనుగుణంగానే వివిధ శాఖలకు కేటాయింపులు కూడా చేశామని చెబుతుంది! అంతేనా.. ఆయా కేటాయింపులు కూడా ఘనంగానే కనిపిస్తాయి! కానీ, ఏడాది తిరిగే సరికి కేటాయింపుల్లో కనిపించే ఘనం.. నిధుల విడుదలలో కనిపించదు! తెలంగాణ బడ్జెట్‌లోనూ ఇదే పరిస్థితి! 


హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ఆరు నెలల కాలానికి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 10వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్‌ అసెంబ్లీకి సమర్పించారు. ఆర్థిక మాంద్యం పేరిట తొలుత పెట్టిన బడ్జెట్లోని కేటాయింపులను సవరించారు. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, బడ్జెట్లోని కేటాయింపులకు, వాస్తవంగా ఖర్చు చేసిన నిధులకు ఏమాత్రం పొంతన లేదు. కొన్ని పథకాలకు భారీగా కేటాయించినా ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. మరికొన్ని పథకాలకు అరకొర మంజూరులతోనే సరిపెట్టారు.


2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆదివారం ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే, గత బడ్జెట్‌లో కేటాయింపులు.. ఇప్పటి వరకూ చేసిన ఖర్చుపై ఆసక్తి నెలకొంది. ఉదాహరణకు, రుణ మాఫీ పథకం కింద గత బడ్జెట్‌లో రూ.6000 కోట్లు కేటాయించారు. రుణ మాఫీ అమలుకు రూ.25 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని భావించి.. నాలుగు విడతల్లో పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించారు. తీరా, ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇక, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి పథకానికి గత బడ్జెట్లో రూ.1,810 కోట్లు కేటాయించారు. కానీ, ఈ పథకం కూడా అమల్లోకి రాలేదు. సంబంధిత నిధులు కూడా ఖర్చు చేయలేదు. అలాగే, ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. అదే సమయంలో, ఆసరా పింఛనుదారుల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలూ కూడా ఇప్పటి వరకూ అమల్లోకి రాలేదు.


ఈ రెండు అంశాలకూ కూడా బడ్జెట్లో నిధులు కేటాయించినా వాటికి సంబంధించిన ఖర్చు మాత్రం లేదు. అలాగే, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.5,750 కోట్లను కేటాయించారు. కానీ, ఖర్చు అందులో సగం కూడా లేదు. గొర్రెల పంపిణీకి కేటాయించిన నిధుల పరిస్థితి కూడా ఇంతే. మునిసిపాలిటీలకు బడ్జెట్లో రూ.521 కోట్లు కేటాయించారు. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులు కూడా కలిపితే వెయ్యి కోట్లు కేటాయించినట్లు అవుతుంది. ఆర్థిక సంఘం ద్వారా గత పది నెలల్లో విడుదల చేసిన నిధులు రూ.150 కోట్లను మించలేదు. ఇక, ప్రభుత్వ ప్రాధాన్య పథకమైన కల్యాణలక్ష్మి అమల్లో అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. ఇక, సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేరిటే ఏర్పాటు చేసిన కేసీఆర్‌ కిట్‌ పథకం పరిస్థితి కూడా ఇంతే. రైతు బంధు కోసం బడ్జెట్‌లో రూ. 12,300 కోట్లను కేటాయించగా, ఇప్పటి వరకు రూ. 10,552 కోట్లను విడుదల చేశారు. ఇలా పలు రంగాలకు కేటాయింపుల మేర నిధులను ఖర్చు చేయలేదు.


అయితే.. కొన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మాత్రం కేటాయింపుల కంటే ఎక్కువ నిధులను ఖర్చు చేశారు. నిజానికి, వాస్తవ ఖర్చు ఆధారంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బిల్లుల చెల్లింపు విషయంలోనూ ప్రభుత్వం కీలక విధాన నిర్ణయం తీసుకుంది. ‘‘సరైన ఆర్థిక నిర్వహణ జరగాలని ప్రభుత్వం అభిలషిస్తోంది. ముందుగా అన్ని శాఖల్లోనూ ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని నిర్ణయించాం. ఇందుకు ఈ బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశాం. బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త పనులు చేపట్టాలనే విధాన నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంది’’ అని బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కానీ, పెండింగు బిల్లుల విషయంలో అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు.

రూ.కోట్లలో


రాబడిలో తగ్గుదల కారణమా!?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తుందని అంచనా వేసిన ఆదాయంలో జనవరి వరకూ 70 శాతం రాబడి నమోదైంది. పలు రంగాల్లో అంచనా వేసిన రాబడిలో తగ్గుదలకనిపిస్తోంది. జనవరినాటికి మొత్తం రూ.1,13,099 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, రూ.79,488 కోట్లు మాత్రమే వచ్చింది. జీఎస్టీ కింద రూ.31,186 కోట్లు వస్తుందని అంచనా వేస్తే.. రూ.22,892 కోట్లు; అమ్మకం పన్ను ద్వారా రూ.21,972 కోట్లకు ఇప్పటి వరకు రూ.15,981 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా కింద రూ.14,348 కోట్లు వస్తుందని భావిస్తే.. ఇప్పటికి రూ.9,472 కోట్లు మాత్రమే వచ్చింది. రాబడి పడిపోవడం ఖర్చుపై ప్రభావం చూపిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-03-08T09:59:07+05:30 IST