బ్రిటన్‌లో ఉన్న నిజాం డబ్బు కోసం తప్పుడు పత్రాలు!

ABN , First Publish Date - 2020-11-19T11:38:35+05:30 IST

నిజాం వంశస్థులకు సంబంధించి బ్రిటన్‌లో ఉన్న 35మిలియన్‌ పౌండ్లను

బ్రిటన్‌లో ఉన్న నిజాం డబ్బు కోసం తప్పుడు పత్రాలు!

హైదరాబాద్‌ : నిజాం వంశస్థులకు సంబంధించి బ్రిటన్‌లో ఉన్న 35మిలియన్‌ పౌండ్లను కాజేయడానికి నిజాం వారసులు తప్పుడు పత్రాలు దాఖలు చేశారని నిజాం మనవడు నజఫ్‌ అలీఖాన్‌ ఆరోపించారు. 70ఏళ్లుగా వివాదంలో ఉన్న ఆ డబ్బు సర్వాధికారాలపై పాకిస్థాన్‌ను తోసి పుచ్చుతూ ఇండియాకే చెందుతాయని గతేడాది కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రిన్స్‌లు ముకర్రంజా, ముఫక్కంజాలతో పాటు వంశీయులందరూ కూర్చొని వాటాల గురించి చర్చిస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రిన్స్‌, వారి సోదరుడు (ముకర్రంజా, ముఫక్కంజాలు) వాటాల పంపిణీపై చర్చలతో పరిష్కరించుకుంటామన్నారు. ఒకవేళ చర్చలతో వాటాల సమస్య పరిష్కారం కాకుంటే కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామన్నారు.


బ్రిటన్‌లో ఉన్న 35మిలియన్‌ పౌండ్లను ఇక్కడ నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు సంబంధించి 120 కుటుంబాల్లో ఎవరి వాటా ఎలా ఉంటుందో నిర్ణయించుకుంటామని ప్రకటించుకున్నారు. తాజాగా వివాదంలో ఉన్న ఆ సమస్యను పరిష్కరించడానికి తన వంశీకులు తప్పుడు పత్రాలు సమర్పించారని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ముకర్రంజా, ఆయన మాజీ భార్య. జీపీఏ కలిగి ఉన్న ఎస్రా బిర్గెన్‌ జా, ఆయన కుమారు అజ్మత్‌ జా, సోదరుడు ముఫక్కం జాలు తప్పుడు పత్రాలు సమర్పించారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.

Updated Date - 2020-11-19T11:38:35+05:30 IST