ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..

ABN , First Publish Date - 2020-12-29T04:34:43+05:30 IST

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..
రవళి (ఫైల్‌)

మానసిక వేదనతో నవ వధువు ఆత్మహత్య

పెళ్లయిన 16 రోజులకే ఘటన

మాణిక్యాపూర్‌లో విషాదం 


భీమదేవరపల్లి, డిసెంబరు 28 : ఆమె ఒకరిని ప్రేమించింది.. కానీ తల్లిదండ్రులు మరొకరితో వివాహం జరిపించారు. అటు ప్రేమించిన వాడిని మర్చిపోలేక, ఇటు మూడుముళ్లు వేసిన వ్యక్తితో దాంపత్య జీవనం సాగించలేక తీవ్ర క్షోభకు లోనైంది. మనసు ఒకరితో, తనువు మరొకరితో పంచుకోలేక చివరకు ప్రాణాలు తీసుకొంది.  ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. పెళ్లయిన 15 రోజులకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. 

ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన మెడబోయిన రజాక్‌కు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు రవళి(20) ఇంటర్‌ వరకు చదువుకుంది. ఈనెల 11న భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌ గ్రామానికి చెందిన ఐలవోయిన రాజుతో వివాహం జరిపించారు. 16 రోజుల పండుగ తర్వాత  రవళి అత్తవారింట అడుగుపెట్టింది. అయితే ఆమె ఎప్పుడూ మౌనంగా ఉండేది. దీంతో అత్తామామ, భర్త రాజు రవళిని పదేపదే అడిగినా ఆమె సమాధానం ఎలాంటి చెప్పేది కాదు.  కొత్త వాతావరణం వల్ల అలా ఉంటుండవచ్చని, త్వరలోనే అలవాటవుతుందని వారు భావించారు.  సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఇంటి పక్కన ఉన్న చిన్నారితో కాలక్షేపం చేసిన రవళి.. సాయంత్రం పాపను ఆమె ఇంటికి పంపించింది. ఆ తర్వాత తమ బెడ్‌రూంకు వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.


అమ్మా ఈ జన్మకు నన్ను క్షమించు...

ఒకరిని ప్రేమించి.. మరొకరికి భార్యగా ఉండలేక మానసిక వేదనతో చనిపోతున్నట్లు రవళి తన సూసైడ్‌ లేఖలో పేర్కొంది. ఆత్మహత్యకు ముందు ఆమె సుదీర్ఘ లేఖరాసింది. అమ్మానాన్నల కోరిక మేరకు పెళ్లి చేసుకున్నానని,  కానీ ప్రేమించిన వాడిని మరిచిపోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. తాను ప్రేమించిన వ్యక్తి సుఖంగా ఉండాలని, సంతోషకర జీవితం గడపాలని కోరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.  ‘అమ్మా ఈ జన్మకు నన్ను క్షమించు’ అంటూ తల్లిని కోరింది.

కాగా, పెళ్లయిన 16 రోజులకే రవళి ఆత్మహత్య చేసుకోవడం ఇటు కుటుంబసభ్యులు బంధువులు, గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలాన్ని హసన్‌పర్తి సీఐ శ్రీధర్‌రావు, ముల్కనూర్‌ ఎస్సై రాజ్‌కుమార్‌ సందర్శించి విచారణ చేపట్టారు.  

Updated Date - 2020-12-29T04:34:43+05:30 IST