భట్టి, తలసాని ‘డబుల్’ పర్యటనకు బ్రేక్.. మళ్లీ ఛాలెంజ్
ABN , First Publish Date - 2020-09-18T19:33:10+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మహానగర అభివృద్ధి కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సంవాదం జరుగుతున్న విషయం విదితమే.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మహానగర అభివృద్ధి కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సంవాదం జరుగుతున్న విషయం విదితమే. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య సవాల్ నడిచింది. ఈ క్రమంలో తాను స్వయంగా భట్టి ఇంటికెళ్లి ఆయన్ను తీసుకొని, డబుల్ బెడ్‌రూం ఇళ్లను చూపించారు. నిన్న, ఇవాళ రెండ్రోజుల పాటు పర్యటించారు. అయితే.. సడన్‌గా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పర్యటనకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
అర్ధాంతరంగా ముగిసింది!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లు చూపించమంటే పక్క నియోజకవర్గాల్లో ఇళ్లు చూపిస్తున్నారని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అసహనం వ్యక్తం చేసి కొల్లూరుకు రావాలంటూ తలసాని వెళ్లిపోయారు. అయితే.. 150 డివిజన్ల పరిధిలో ఎక్కడ చూపించినా వస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. నాగారం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ నేతలు వెనుదిరిగారు. భట్టీ మాత్రం రాంపల్లిలోనే ఆగిపోయారు. ఎవరి దారిన వారు వెళ్లిపోవడంతో రెండో రోజు కొనసాగుతున్న ఇళ్ల పరిశీలన అర్దాంతరంగా ముగిసింది. మరోవైపు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతురామ్మోహన్ మాత్రం కొల్లూరుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విమర్శల వర్షం కురిపించుకున్నారు.

కేసీఆర్, కేటీఆర్‌కు ఛాలెంజ్
‘ఇళ్లు చూపించమంటే ప్రభుత్వం పారిపోయింది. నిన్న చూపిన 3,400 ఇళ్లను నేను పరిగణిస్తున్నాను. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టకుండా ఇతర చోట్ల కట్టిన లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలు ఇళ్లు చూపించమంటే మహేశ్వరంలో చూపిస్తున్నారు. 5 నియోజకవర్గాల్లో కేవలం 3,400 ఇళ్లే కట్టారు. లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పాలని సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఛాలెంజ్ చేస్తున్నాను. లక్ష ఇళ్లు నిర్మించే వరకు ప్రభుత్వం వెంట పడతాం’ అని భట్టీ విక్రమార్క ఛాలెంజ్ చేశారు.

ఓర్వలేకే సాకులు..
భట్టి కామెంట్స్‌పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ ఇళ్లు పూర్తిగా చూడకుండా మాట్లాడొద్దు. ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లన్నీ చూపిస్తున్నాం. ఓర్వలేక కాంగ్రెస్ నేతలు కుంటిసాకులు చెబుతున్నారు. వస్తే అన్నీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూపిస్తాం. ఈరోజు వరకే తిరుగుతాం.. మిగిలిన ఇళ్ల వివరాలు ఇస్తాం. తుక్కగూడలో కట్టినా.. గ్రేటర్ ప్రజలకే ఇస్తాం’ అని తలసాని మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

