ప్రైవేటు ఆస్పత్రులకు ‘బౌన్సర్లు’

ABN , First Publish Date - 2020-08-13T07:49:41+05:30 IST

బౌన్సర్లు ఇప్పటివరకు సెలబ్రెటీలకే పరిమితమని భావించేవాళ్లు. కానీ కొవిడ్‌-19 పరిస్థితుల్లో

ప్రైవేటు ఆస్పత్రులకు ‘బౌన్సర్లు’

రోగుల బంధువులు గొడవకు దిగకుండా ఏర్పాట్లు.. 

ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తున్న వైనం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): బౌన్సర్లు ఇప్పటివరకు సెలబ్రెటీలకే పరిమితమని భావించేవాళ్లు. కానీ కొవిడ్‌-19 పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకూ వారు బందోబస్తు కల్పిస్తున్నారు. బౌన్సర్లు అనుమతిస్తేనే లోపలికి ప్రవేశం లభిస్తుంది. లేకుంటే వారిని దాటి ఏ ఒక్కరూ అడుగుపెట్టలేని పరిస్థితి. ఆస్పత్రుల పరిసర ప్రాంతాలు పూర్తిగా సీసీ కెమెరాల  నిఘాలో ఉన్నా.. సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నా సరే.. ఆస్పత్రి యాజమాన్యాలు బౌన్సర్లను అదనంగా నియమించుకుంటున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ రోగి బంధువులకు బౌన్సర్లతోనే సమాధానం చెప్పిస్తుండటం విశేషం. రోగి బంధువుల నుంచి బిల్లులు వసూలు చేయడం దగ్గర నుంచి మృతదేహాల అప్పగింత వరకు అన్నీ వారి కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరు వైద్యరంగానికే తలవంపులు తెస్తున్నాయి. రోగుల నుంచి అందినకాడికి డబ్బులు పిండుకోవడమే కాదు.. పరిస్థితి విషమించి  ఎవరైనా చనిపోయిన పక్షంలో పూర్తి బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భాల్లో రోగి బంధువులు ఎదురు తిరిగితే బౌన్సర్లను రంగంలోకి దించుతున్నారు. పది రోజుల క్రితం వరకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల వద్ద అంతా సాధారణంగానే ఉండగా.. దోపిడీ పరాకాష్టకు చేరడంతో బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. మియాపూర్‌లో ఉండే ఓ కంపెనీ మేనేజర్‌ కరోనా పాజిటివ్‌తో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయంలో రూ.3 లక్షలు డిపాజిట్‌ చేసుకున్నారు. చికిత్స క్రమంలో విడతల వారీగా డబ్బులు చెల్లించినా.. వాటికి రసీదులేవీ ఇవ్వలేదు. ఓ కాగితంపై అమౌంట్‌తో పాటు స్టాంప్‌ వేసి ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసుకున్నట్లు చూపించారు. 11 రోజులకు మొత్తంగా రూ.14 లక్షలు వసూలు చేశారు. తీరా డిశ్చార్జి సమయంలో పూర్తి బిల్లులు ఇవ్వాలని అడిగితే రూ.2 లక్షలకే ఇచ్చారు. అదేమిటని అడిగితే.. కుదరదంటూ చేతులు దులిపేసుకున్నారు. దీనిపై గట్టిగా నిలదీస్తే బౌన్సర్లతో బయటకు పంపించారు. మున్ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే తమ ఆస్పత్రికి రావద్దంటూ, ఇదే చివరి అవకాశమని చెబుతుండటం గమనార్హం. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తే.. కరోనా పాజిటివ్‌ రోగులకే కాదు.. ఇతర జబ్బులతో అత్యవసర చికిత్స కోసం వెళ్లిన వారికీ బిల్లులు అడ్డగోలుగా వేసేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎల్‌బీనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తే.. నగదు చెల్లిస్తేనే చేర్పించుకుంటామని అంబులెన్స్‌లో నుంచి దిగక ముందే చెప్పారు. ఆ షరతులకు తలొగ్గి ఆస్పత్రిలో 7 రోజులు చికిత్స తీసుకుంటే.. రూ.7లక్షల బిల్లు వేశారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో మూత్రపిండాల సమస్యతో ఓ రోగి చేరితే.. కరోనా పాజిటివ్‌ కాకున్నప్పటికీ ఇష్టానుసారంగా బిల్లులు వేసినట్టు ఆరోపణలున్నాయి.  


బౌన్సర్‌లతో అన్ని విధాలా సేఫ్‌

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రస్తుత సమయంలో బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలుగా రక్షణ లభిస్తోందని భావిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో రోగుల సహాయకులు, బంధువులు ఎవరూ లేకుండా బౌన్సర్లు చూస్తున్నారు.  రోగిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసే సందర్భంలో తప్ప.. వైద్యులను రోగి బంధువులు ఆరా తీసే పరిస్థితి లేదు. బిల్లులు, ఇతర విషయాలపై ఆస్పత్రి అడ్మినిస్ర్టేషన్‌, డైరెక్టర్లతో మాట్లాడనివ్వని పరిస్థితి ఉంది. రోగులు చనిపోతే పూర్తి బిల్లులు చెల్లిస్తేనే శవాన్ని ఇచ్చేలా బౌన్సర్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు రాజకీయ పార్టీలకు చెందినవారు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు చేస్తుండటంతో గేట్లను మూసేసి అడ్డుగా ఉంటున్నారు. ఆయా ఆస్పత్రుల నుంచి డబ్బులను తీసుకెళ్లే క్రమంలో రక్షణ కోసమంటూ బౌన్సర్ల సేవలను వినియోగిస్తుండటం విశేషం.

Updated Date - 2020-08-13T07:49:41+05:30 IST