కృష్ణానదిలో పుట్టి బోల్తా.. నలుగురు గల్లంతు

ABN , First Publish Date - 2020-08-18T07:22:18+05:30 IST

నారాయణపేట జిల్లా పరిధిలో కృష్ణానదిలో పుట్టి బోల్తాపడి నలుగురు గల్లంతయ్యారు. ఇందులోనే

కృష్ణానదిలో పుట్టి బోల్తా.. నలుగురు గల్లంతు

  • 9 మంది సురక్షితం.. అందరూ ఒకే  గ్రామానికి చెందినవారు 

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌ : నారాయణపేట జిల్లా పరిధిలో కృష్ణానదిలో పుట్టి బోల్తాపడి నలుగురు గల్లంతయ్యారు. ఇందులోనే ప్రయాణిస్తున్న మరో 13 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆత్కూరు మండలం కుర్వపురం గ్రామానికి చెందిన 12 మంది నిత్యావసరాల కొనుగోలుకు, బంధువులను కలిసేందుకు, వివిధ పనులపై నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం పంచదేవ్‌పాడ్‌, మక్తల్‌ తదితర ప్రాంతాలకు వచ్చారు. వీరిలో ముగ్గురు(విష్ణు, రోజా, సుమలత) ఒకే కుటుంబానికి చెందినవారు. పనులన్నీ ముగించుకొని సోమవారం సాయంత్రం తమ స్వగ్రామం కుర్వపురం దిశగా ఓ పుట్టిలో వీరంతా తిరుగు పయనమయ్యారు. మక్తల్‌ మండలం పస్పుల, వల్లభాపురం గ్రామాల మధ్య కృష్ణానదిలో వెళ్తుండగా ఒక్కసారిగా పుట్టి పల్టీకొట్టి నీట మునిగింది. ఈ ప్రమాదంలో సుమలత(35), రోజా(6), నర్సమ్మ(40), పార్వతమ్మ(55) గల్లంతయ్యారు. కుర్వపురం గ్రామానికి చెందిన పుట్టి నడిపే వ్యక్తి అంజప్ప సహా దళపతి, నాగప్ప, బుడ్డన్న, తిమ్మన్న, చిన్ననాగేష్‌, మోహన్‌, విష్ణు, అంజిలమ్మ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పుట్టి బోల్తాపడి నీట మునిగిన స్థలానికి అతి దగ్గరలోనే పెద్ద రాయి, చెట్లు, మట్టితో కూడిన ఓ గుట్ట ఉండటంతో పెను ప్రాణాపాయం తప్పింది. పస్పుల గ్రామానికి చెందిన శ్రీపాద, నర్సింహులు, ఆది లింగప్ప, ఈదప్పలు రెండు పుట్టిల ద్వారా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఒడ్డుకు చేర్చారు. ఇక జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్లకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యాన్ని ఏపీకి తరలిస్తుండగా, వారు ప్రయాణిస్తున్న నాటుపడవ తుంగభద్ర నదిలో బోల్తాపడింది. దీంతో అందులోని 30 కాటన్ల మద్యం నీట మునిగిపోయింది. ముగ్గురిలో ఉత్తనూరు రవి (30) గల్లంతు కాగా, మరో ఇద్దరు (రాఘవేంద్ర, ఆంజనేయులు) ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరోవైపు ఎల్లంపల్లి వరద కాలువలో స్నానానికి దిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులకు చెందిన ముచ్చర్ల అంజలి (12), ముచ్చర్ల లావణ్య (13) వరద ప్రవాహానికి నీటమునిగి మృతిచెందారు. ఇదే జిల్లాలోని తంగళ్లపల్లి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జంగంపల్లి శ్రీనివాస్‌ (33) మరో ముగ్గురితో కలిసి ప్రయాణిస్తున్న కారు దర్గపల్లి వాగులో కొట్టుకుపోయింది. జంగంపల్లి శ్రీనివాస్‌ ప్రవాహంలో కొట్టుకుపోగా, మిగతా ముగ్గురిని గ్రామస్థులు కాపాడారు. కాగా, భూపాలపల్లి జిల్లా గుడాడ్‌పల్లి, కొత్తపల్లి(ఎ్‌సఎం) గ్రామాల మధ్య మోరంచవాగుపై వంతెన పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు వరదల్లో చిక్కుకోగా ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం రక్షించింది. 

Updated Date - 2020-08-18T07:22:18+05:30 IST