‘సరిహద్దు పటేల్‌’ కన్నుమూత

ABN , First Publish Date - 2020-02-12T08:36:18+05:30 IST

నిజాం వ్యతిరేక పోరాటంలో ‘సరిహద్దు పటేల్‌’ గా పేరు పొందిన పోతుమంచి నరసింహరాజు (91) ఇకలేరు. కొంత కాలంగా శ్వాసకోస సమస్యతో

‘సరిహద్దు పటేల్‌’  కన్నుమూత

నిజాంపై అలుపెరగని పోరాటం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : నిజాం వ్యతిరేక పోరాటంలో ‘సరిహద్దు పటేల్‌’ గా పేరు పొందిన పోతుమంచి నరసింహరాజు (91) ఇకలేరు. కొంత కాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా రామాపురం. 14 ఏళ్ల వయసులోనే నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ‘ఆంధ్ర మహాసభ’ సమావేశాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.


హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ తొలితరం సభ్యుడిగా సేవలందించారు. పటేల్‌-పట్వారీల రికార్డులు, అబ్కారీశాఖ దస్త్రాలను తగలబెట్టడం ద్వారా రజాకార్ల ఆగ్రహానికి గురయ్యారు. కృష్ణానదిలో ఈదుకుంటూ మోర్జంపాడు చేరుకున్నారు. ఆనాటి నుంచి నరసింహరాజును గ్రామస్తులంతా ‘సరిహద్దు పటేల్‌’గా పిలిచేవారు. స్వాతంత్య్ర పోరాటంలో గాయాలపాలైన పేద కార్యకర్తల చికిత్స కోసం తన కొద్దిపాటి భూమిని అమ్మిన ఘనత నరసింహరాజు సొంతం. స్వాతంత్ర్యానంతరం పోలీసు శాఖలో ఉద్యోగిగా చేరి 1984లో పదవీ విరమణ పొందారు. 

Updated Date - 2020-02-12T08:36:18+05:30 IST