సర్వాంగసుందరంగా అలంకరించిన లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయం

ABN , First Publish Date - 2020-07-19T20:45:48+05:30 IST

ఆషాఢ బోనాల పండగ సందర్భంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహని అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు.

సర్వాంగసుందరంగా అలంకరించిన లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయం

హైదరాబాద్‌: ఆషాఢ బోనాల పండగ సందర్భంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహని అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆదివారం బోనాల పండగ అయినా భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించలేదు. బోనాలను భక్తులు బోనాలను తమ ఇంట్లోనే అమ్మవారికి సమర్పించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తుల రాకతో, పోతరాజుల వీరంగాలు, బోనాలను తలపై పెట్టుకుని అమ్మవారికి సమర్పించడానికి వచ్చే మహిళలతో లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయ పరిసరాలు కిటకిటలాడేవి. కానీ ఈసారి కరోనా వ్యాప్తి కారణంగా బోనాలను తీసుకురావడం, గుంపులుగా భక్తులు తరలిరావడాన్ని నిలిపి వేశారు. అమ్మవారికి అర్చకులు, దేవాలయ కమిటీ వారే బోనాలు సమర్పించడంతో పాటు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అయినా ప్రతి సంవత్సరంలాగే ఆలయాన్ని మాత్రం అందంగా ముస్తాబు చేశారు. 


కళ్లుచెదిలే విద్యుత్‌ కాంతులతో ఆలయం కళకళలాడుతోంది. తెలంగాణలో బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ప్రాశస్త్యం ఉంంది. నాటి నిజాం నవాబు సైతం అమ్మవారికి పసుపు కుంకుమ,గాజులు, పట్టుచీర సమర్పించిన చరిత్ర కలిగిన ఆలయంగా లాల్‌దర్వాజ ఆలయం ప్రసిద్ధి పొందింది. కరోనా కారణంగా ఈసారి ఆంక్షలు విధించారు. భక్తుల సందడి లేకపోయినా సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఆలయాన్ని రంగు రంగుల పుష్సాలతో అలంకరించారు. 


శనివారం చండీహవనం చేసినట్టు ఆలయ కమిటీ సలహాదారు రంగారమేష్‌గౌడ్‌ తెలిపారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపు తర్వాత అర్ధరాత్రి బలిహరణ కార్యక్రమాన్నినిర్వహించారు. ఆదివారం తెల్లవారు జుము నుంచి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు నిర్వమించారు. సాధారణ భక్తులకు అనుమతి లేదు. కాబట్టి ఆలయ కమిటీ తరపున అమ్మవారికి బోనాల సమర్పణ వంటి క్రతువునిర్వహించారు. 

Updated Date - 2020-07-19T20:45:48+05:30 IST