నెత్తురోడ్లు
ABN , First Publish Date - 2020-12-06T07:31:17+05:30 IST
వరుస ప్రమాదాలతో తెలంగాణలో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రహదారులపై ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ప్రభుత్వం,

రాష్ట్రంలో వరుసగా రహదారి ప్రమాదాలు.. బ్లాక్ స్పాట్లు.. మలుపుల వద్ద దుర్ఘటనలు
ఎక్కువ శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే.. ప్రాణాలు తీస్తున్న అతి వేగం, నిర్లక్ష్యం
కరోనా మరణాల కంటే మూడింతలు .. లాక్‌డౌన్‌లో పరిస్థితి కొంత మెరుగు
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం కందాడ-మల్కాపూర్ రోడ్డు మలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బోర్‌వెల్ లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 11 మందిలో ఏడుగురు దుర్మరణం చెందారు.
శుక్రవారం మధ్యాహ్నం సిద్దిపేట శివారులో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో సీఐ, కానిస్టేబుల్ సహా 12 మంది గాయపడ్డారు. మొదట కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ఘటనా స్థలంలో గుమిగూడిన జనంపైకి డీసీఎం దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతి చెందారు.
గత నెలలో ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన ఽఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు మృతి చెందారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
వరుస ప్రమాదాలతో తెలంగాణలో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రహదారులపై ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్ల వేలాది మంది బతుకులు గాలిలో కలిసి పోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మలుపుల వద్దే జరుగుతున్నాయి. మలుపులు, ఇరుకు రోడ్లు, వంతెనల్ని బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించ ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.\
\ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 8,712 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2,595 మంది మృతి చెందగా 9,173 మంది గాయపడ్డారు. 2019లో 6,964 మంది మృతి చెందగా 21,999 మంది గాయపడ్డారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 1,467 మంది మృతి చెందగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య అంతకు దాదాపు మూడింతలుగా ఉంది.
ఇవీ బ్లాక్ స్పాట్స్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో నిర్మాణంలో ఉన్న నాగరగూడ బిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎక్కువగా రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లిలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి
షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూర్, నందిగామ, ఫరూఖ్‌నగర్ మండలాల్లో 44వ జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నందిగామ, కొందుర్గు, కేశంపేట, చౌదరిగూడ మండలాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
వికారాబాద్ జిల్లాలో 21 బ్లాక్ స్పాట్లను గుర్తించారు.
మేడ్చల్ జిల్లా పోచారం మునిసిపాలిటీ, అన్నోజిగూడలోని ఎన్టీపీసీ చౌరస్తా వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వరంగల్ హైవేపై అవుశాపూర్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది.
కరీంనగర్ జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారిపై 14 బ్లాక్‌స్పాట్‌లు, వరంగల్ రహదారిపై 13 బ్లాక్‌స్పాట్‌లు గుర్తించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై 11 డేంజర్ జోన్లను గుర్తించారు. నేరడిగొండ మండలం గుడిహత్నూర్, ఆదిలాబాద్, జైనథ్ మండలాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి నేషనల్ హైవే అథారిటీకి నివేదికను ఇచ్చినా, దిద్దుబాటు చర్యల్లేవు.
నిర్మల్ జిల్లాలో నెల రోజుల్లోనే 20కి పైగా ప్రమాదాలు జరిగాయి. 16 మంది మరణించినా ఇప్పటి వరకు డేంజర్ జోన్లను గుర్తించలేదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై పెర్కిట్, డిచ్‌పల్లి, భిక్కనూర్ టోల్‌గేట్, పొందుర్తి ఆర్‌టీఏ చెక్‌పోస్టు, దగ్గి వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 9 నెలల్లోనే 338 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 149 మంది మృతి చెందారు.
పాలమూరు జిల్లాలోని 44వ నెంబరు జాతీయ రహదారి, 167 జాతీయ రహదారిపై పలు చోట్ల బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. జిల్లాలో ఈ ఏడాది 220 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
నారాయణపేట జిల్లాలో ఈ ఏడాది 131 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 73 మంది మృత్యువాత పడ్డారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, బిజినేపల్లి, వంగూరు మండలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
వనపర్తి జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ఏడాది 2 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఈ ఏడాది 145 రోడ్డు ప్రమాదాల్లో 63 మంది మృతి చెందారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, ధరూర్, మల్దకల్, ఇటిక్యాల, అలంపూర్ మండలంలోని పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
సూర్యాపేట జిల్లాలో 24, నల్లగొండ జిల్లాలో 42 బ్లాక్ స్పాట్లను గుర్తించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ యేడాది జరిగిన 958 ప్రమాదాల్లో 450 మంది మృతి చెందారు.
సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారిపై ఈ ఏడాది దాదాపు 150 వరకు ప్రమాదాలు జరగగా 50 మంది వరకు చనిపోయారు. ప్రధానంగా సిద్దిపేట శివారులోని రంగీల చౌరస్తా, పొన్నాల దాబా, కుకునూరుపల్లి పీఎస్ ప్రాంతం, ప్రజ్ఞాపూర్, జనగామ క్రాస్‌రోడ్, కొండపాక క్రాస్‌రోడ్, రంగధాంపల్లి జంక్షన్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 17 బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. జిల్లాలో 574 ప్రమాదాల్లో 273మంది కన్నుమూశారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట వంతెన, ‘వై’ జంక్షన్, ఏటూరునాగారం-మంగపేట మధ్యలోని జీడివాగు, ఏటూరునాగారం-తాడ్వాయి మధ్య అటవీప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది.
జనగామ జిల్లా సరిహద్దులోని పెంబర్తి నుంచి రఘునాథపల్లి మండలం కోమళ్ల వరకు యాక్సిడెంట్ జోన్‌గా ఉంది. జనగామ-పాలకుర్తి దారిలో ప్రమాదాలెక్కువగా ఉన్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 166 డెత్‌స్పాట్‌లు గుర్తించినా, హెచ్చరికలు ఏర్పాటు చేయలేదు. కొణిజర్ల మండలం తనికెళ్ల, కూసుమంచి మండలం పాలేరు జలాశయం ఔట్‌ఫాల్ గేటు ప్రాంతాలు బ్లాక్‌స్పాట్లుగా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలతోపాటు ఇల్లెందు, అశ్వాపురం, పినపాక, మణుగూరు, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
లాక్‌డౌన్‌లో తగ్గిన ప్రమాదాలు
లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గాయి. జనవరి నుంచి జూన్ వరకు దేశంలో రోడ్డు ప్రమాదాలు 35ు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి నుంచి జూన్ వరకు దేశంలో 1.60లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత ఆరేళ్ల ప్రథమార్ధాల్లో జరిగిన ప్రమాదాలతో పోల్చితే ఈ సంఖ్య 35ు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో 50,336 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది మొదటి 6నెలల్లో 56,288మంది మృతి చెందారు. 2019లో తొలి ఆరు నెలల్లో మృతుల సంఖ్య 79,678గా ఉంది.
ప్రతిపాదనలకే పరిమితమైన రోడ్ సేఫ్టీ
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రమాదాల నివారణ కోసం జాతీయ, రాష్ట్ర రహదారులపై సుమారు 50 రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సూచన మేరకు అధికారులు గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. 70 పోలీస్ స్టేషన్ల ఆవశ్యకతను గుర్తించారు. అందుకు అవసరమైన వాహనాల కొనుగోలు, లేజర్ గన్స్, స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజర్స్, ఫస్ట్ ఎయిడ్ వైద్యం తదితర సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
రీజినల్ కార్యాలయాల ఏర్పాటు
రహదారులపై 22 రీజినల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఇటీవల రోడ్డు భద్రతా విభాగం అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి 1,800 కి.మీ.కు ఒక డివిజన్ కార్యాలయం, 900 కి.మీ.కు గ్రూప్ కార్యాలయం, 600 కి.మీ. పరిధిలో సబ్ గ్రూప్ కార్యాలయం, ప్రతి 300 కి.మీ దూరంలో ఫీల్డ్ ఆఫీసర్ ఉండేలా ఇది వరకే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవి ఎప్పుడు అమలులోకి వస్తాయో చూడాల్సి ఉంది.

ప్రమాదాల నివారణకు చర్యలేవి?
రాష్ట్రంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగాలు పెద్దగా పట్టించుకోవడంలేదు. పలు ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించినా ప్రమాద నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, మలుపుల వద్ద సూచికలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఐదుసార్లు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి అక్కడ ప్రమాదాలు నివారించేందుకు యాక్సిడెంట్ రిసాల్వేషన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులు, పోలీసులు సభ్యులుగా ఉంటారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాటుతోపాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జనవరిలో వారం రోజుల పాటు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

రోడ్డు భద్రతకు 600 కోట్లు
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా రూ.600 కోట్లు కేటాయించాలని ప్రపంచ బ్యాంకును రోడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కోరారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.15 వేల కోట్లతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే నిధుల్ని అన్ని రాష్ట్రాలకు గ్రాంట్ రూపంలో చెల్లిస్తారు. రోడ్డు భద్రతా విభాగంలో భాగస్వామ్యమైన విభాగాలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అధికారులతో ఇటీవల చర్చించింది.
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా రూ.600 కోట్లు కేటాయించాలని ప్రపంచ బ్యాంకును రోడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కోరారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.15 వేల కోట్లతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే నిధుల్ని అన్ని రాష్ట్రాలకు గ్రాంట్ రూపంలో చెల్లిస్తారు. రోడ్డు భద్రతా విభాగంలో భాగస్వామ్యమైన విభాగాలు, ఇతర అంశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అధికారులతో ఇటీవల చర్చించింది.