‘కమలం’లో కదనోత్సాహం

ABN , First Publish Date - 2020-12-11T05:42:20+05:30 IST

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం వరంగల్‌ నగరంలో జరుపనున్న పర్యటన ఆసక్తి రేపుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో.. కిషన్‌రెడ్డి తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది.

‘కమలం’లో కదనోత్సాహం

నేడు నగరంలో బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి పర్యటన
అధికార, అనధికార కార్యక్రమాలకు హాజరు
జీడబ్ల్యుఎంసీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన నేతలు
ఇప్పటికే ‘కాషాయం’ బాటలో పలువురు నాయకులు
నేడో రేపో ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు, రాజనాల శ్రీహరి చేరిక
వేడెక్కుతున్న ఓరుగల్లు రాజకీయాలు


హన్మకొండ, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం వరంగల్‌ నగరంలో జరుపనున్న పర్యటన ఆసక్తి రేపుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో.. కిషన్‌రెడ్డి తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వరంగల్‌ రావడం ఇదే మొదటి సారి. ఇంకో మూడు నెలల్లో వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఎన్నికలు జరగనున్న తరుణంలో కిషన్‌రెడ్డి రాక అనేక సంకేతాలనిస్తోంది.

మరిన్ని వలసలు..
దుబ్బాక  ఉపఎన్నికలో  గెలుపు తర్వాత అందరి దృష్టి బీజేపీ వైపు మళ్లింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 48 డివిజన్లను గెలుచుకొని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి సవాల్‌ విసిరింది. రాబోయే వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగురవేయడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో బీజేపీ ప్రాభవం పెరుగుతుండడంతో ఆ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కాంగ్రె్‌సతో పాటు టీఆర్‌ఎ్‌సలోని అసంతృప్త నేతలు, కార్యకర్తలు కమలం నీడన చేరుతున్నారు.

     ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీజేపీలోకి వలసలు ఏడాది క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ మధ్యకాలంలో మరింత జోరందుకున్నాయి. టీడీపీ నుంచి పలువురు నేతలు ఇది వరకే కాషాయ కండువాలు కప్పుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు  పలువురు అగ్రశ్రేణి నాయకులు బీజేపీలో చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తాజాగా మరికొందరు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నారు. గురువారం కూడా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన అచ్చ విద్యాసాగర్‌,  ఆకారపు మోహన్‌, మట్ట రాజేశేఖర్‌రెడ్డి, కూర సురేందర్‌ గౌడ్‌ బీజేపీలో చేరినవారిలో ఉన్నారు.

     ఇక టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు కూడా బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి మంతనాలు జరిపారు. ఆయన హైదరాబాద్‌లో సంజయ్‌ సమక్షంలోనే తన అనుచర గణంతో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రె్‌సలో సుదీర్ఘకాలం పనిచేసి రెండేళ్ల క్రితం టీఆర్‌ఎ్‌సలో చేరిన రాజనాల శ్రీహరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. వివిధ పార్టీలకు చెందిన నగరంలోని మరికొందరు ముఖ్యనాయకులు త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

పక్కా ప్రణాళిక
ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి నగర పర్యటన కొత్త పరిణామాలకు దారితీయొచ్చని పలువురు భావిస్తున్నారు. పైకి ఆయన నగరంలో కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించడానికి వస్తున్నట్లు పేర్కొంటున్నా... దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉంది. రానున్న జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించాలన్న పక్కా ప్రణాళికతోనే కిషన్‌రెడ్డి వస్తున్నట్టు కనిపిస్తోంది.

అభివృద్ధిపై సమీక్ష
కేంద్రం హృదయ్‌ పథకం కింద వరంగల్‌కు రూ.48 కోట్లు విడుదల చేసింది. ఈ హృదయ్‌ నిధులతోనే భద్రకాళి బండ్‌ సుందరీకరణ పనులు, హెరిటేజ్‌ పథకం ద్వారా హన్మకొండ పద్మాక్షి దేవాలయానికి ఎదురుగా జైన మందిరం (అగ్గలయ్య గుట్ట) అభివృద్ధి పనులు చేపట్టారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాజీపేట రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు కూడా కేంద్రం చొరవతోనే మొదలయ్యాయి. నగరంలో స్మార్ట్‌సిటీ,  అమృత్‌ ప్రాజెక్టు పనులు కూడా సాగుతున్నాయి. వీటన్నింటిపైనా కిషన్‌రెడ్డి సమీక్షించనున్నారు. కేంద్ర నిధులతో నగరాభివృద్ధికి రూపొందించాల్సిన ప్రతిపాదనలపై హన్మకొండ సర్క్యూట్‌ గెస్ట్‌హౌ్‌సలో అధికారులతో చర్చించనున్నారు. తొలుత భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ తర్వాత పర్యటన మొదలవుతుంది. చివరన న్యూశాయంపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఇందులో రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయసాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రచారానికి శ్రీకారమా?
కిషన్‌రెడ్డి పర్యటన ఒక విధంగా కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారానికి ఇక్కడి నుంచి శంఖారావం పూరించినట్టేనని పలువురు భావిస్తున్నారు. నాలుగైదు నెలలుగా నగరంలోని బీజేపీ నేతలు తమ రాజకీయ కార్యకలాపాలను ఉధృతం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ఒక్క డివిజన్‌ మాత్రమే గెలుచుకోగలిగింది. 2000 సంవత్సరంలో  మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న చరిత్ర ఉన్న బీజేపీ.. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో దానిని తిరగరాయడానికి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. నగరంలోని మెజారిటీ డివిజన్లను గెలుచుకోవడానికి కిషన్‌రెడ్డి పర్యటన ఉత్ర్పేరకంగా దోహదపడగలదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.


కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు
బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

మట్టెవాడ(వరంగల్‌), డిసెంబరు 10: కేంద్ర ప్రభుత్వ నిధులతో వరంగల్‌ నగరంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరంగల్‌ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు పెద్ద పెండ్యాల వద్ద స్వాగతం పలుకుతామని తెలిపారు. అనంతం హన్మకొండలోని సర్క్యూట్‌ గెస్ట్‌హౌ్‌సలో  స్మార్ట్‌ సిటీ, హృదయ్‌, అమృత్‌ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ వరంగల్‌కు రూ. 300 కోట్ల నిధులను కేటాయిస్తామని చెప్పి మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్‌, సంతో్‌షరెడ్డి, జగదీశ్వర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.   కాగా, హంటర్‌రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా రాజశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఎర్రగట్టు గుట్ట మాజీ చైర్మన్‌ సురేందర్‌ గౌడ్‌లు పద్మ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు.


 • పర్యటన షెడ్యూల్‌...
  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం నగర పర్యటన షెడ్యూల్‌ వివరాలు
  ఉ.9.00 గంటలకు భద్రకాళి గుడి సందర్శన
  9.45 గంటలకు కేఎంసీ ఆవరణలో కొత్తగా నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన
  11.00 గంటలకు హృదయ్‌ పథకం కింద చేపట్టిన భద్రకాళి బండ్‌ పనుల పరిశీలన
  11.50 గంటలకు హన్మకొండ పద్మాక్షిగుడికి ఎ దురుగా గల అగ్గలయ్య గుట్టపై హృదయ్‌ పథ కం కింద అభివృద్ధి చేసిన జైన తీర్థంకరుల పర్యాటకస్థలం పరిశీలన
  12.30 నుంచి 1.00 గంట వరకు సర్క్యూట్‌ గెస్ట్‌హౌ్‌సలో రైల్వే అధికారులతో కాజీపేట రైల్వే బ్రిడ్జిపై సమీక్ష
  1.00 గంట నుంచి 2 గంటల వరకు నగరంలో అమలవుతున్న స్మార్ట్‌ సిటీ, అమృత్‌ ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష
  2.30 గంటలకు సర్క్యూట్‌ గెస్ట్‌హౌ్‌సలో భోజనం
  2.30 గంటలకు న్యూశాయంపేటలోని టీవీఆర్‌ గార్డెన్‌లో బీజేపీ సమావేశానికి హాజరు
  4.30 గంటలకు సూర్యాపేట జిల్లా నకిరేకల్‌ పట్టణానికి ప్రయాణం.

Updated Date - 2020-12-11T05:42:20+05:30 IST