వైరస్‌తో పాటే కారుXకమలం పెరిగిన వైరం

ABN , First Publish Date - 2020-06-25T08:36:32+05:30 IST

రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల పరంగా ఒకింత స్తబ్దత నెలకొన్న రాష్ట్రంలో ఇటీవల ఒక్కసారిగా కాక పెరిగింది. రాష్ట్రంలో అధికార

వైరస్‌తో పాటే కారుXకమలం పెరిగిన వైరం

నాడు సమష్టి పోరు.. నేడు సిగపట్లు

ఆర్థిక ప్యాకేజీపై గులాబీ గుర్రు

తక్కువ పరీక్షలపై కమలం సీరియస్‌

‘కొండపోచమ్మ’ అని నువ్వంటే 

‘నమస్తే ట్రంప్‌’ అని నేనంటా

గవర్నర్‌ తీరుపైనా టీఆర్‌ఎస్‌ కినుక


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల పరంగా ఒకింత స్తబ్దత నెలకొన్న రాష్ట్రంలో ఇటీవల ఒక్కసారిగా కాక పెరిగింది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలు మొదలై, కొన్ని రోజుల్లోనే తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఒక రకంగా కరోనా వైరస్‌ ఉధృతి తరహాలోనే బీజేపీ ప్రభుత్వాల మధ్య వైరమూ పెరుగుతోంది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు బాగున్నాయని అప్పట్లో కేంద్రం ప్రశంసిస్తే.. కరోనా కట్టడిలో పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలన్న మోదీ పిలుపునకు సీఎం కేసీఆర్‌ మద్దతు పలికారు. చప్పట్లు కొట్టినంత మాత్రాన వైరస్‌ పోతుందా? అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేసిన విమర్శలపై కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. కరోనాపై పోరులో సంఘీభావం, ఐక్యత చాటేందుకు చప్పట్లు కొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారని, దాన్ని గౌరవించాలని.. ఈ విషయంలో అనవసర విమర్శలు చేసే వారిని అరెస్టు కూడా చేయాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు. ఇప్పుడిదంతా గతం. కరోనాపై కలిసికట్టుగా పోరాడుదామని ప్రతిజ్ఞ చేసిన రెండు పార్టీల మధ్య ఇప్పుడు అదే వైరస్‌ కుంపటి రగిల్చింది. ఆ ప్రకటన తర్వాత నెల తిరక్కుండానే ఇరుపార్టీల నాయకత్వాలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోతోందంటూ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సునిశిత విమర్శలు చేయడం, గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఇటీవల నిమ్స్‌ను సందర్శించి, కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందంటూ వ్యాఖ్యానించడం టీఆర్‌ఎస్‌  నేతలకు మింగుడుపడలేదు.


జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ  జాతీయ అధ్యక్షుడు సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యానించడంతోపాటు మర్కజ్‌పై కేంద్ర వైఫల్యాన్ని తెరపైకి తెచ్చారు. తాము చెప్పేవరకూ  కేంద్రం ఈ అంశాన్ని గుర్తించలేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగాయి. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా సీఎం కేసీఆర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవంలో వేలాదిమందితో హాజరయ్యారని, బీజేపీ ఆరోపించగా.. నమస్తే ట్రంప్‌ పేరుతో గుజరాత్‌లో వేల మందితో ప్రధాని మోదీ కార్యక్రమాన్ని నిర్వహించడం కరోనా వ్యాప్తికి కారణం కాదా? అని గులాబీ నేతలు నిలదీశారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని, కొవిడ్‌-19ను తక్షణం ఆరోగ్య శ్రీలో చేర్చాలని లేదంటే  రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ను అమలుచేయాలన్న డిమాండ్‌తో రాష్ట్రప్రభుత్వంపై  బీజేపీ నాయకత్వం ధర్నాలు, ఆందోళనలతో ఒత్తిడి పెంచుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచేందుకు కోబాస్‌ -8800 యంత్రం తమకు రావాల్సి ఉండగా, కేంద్రం, దానిని కోల్‌కతాకు తరలించిందంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కొత్త విమర్శనాస్త్రాన్ని తెరమీదకు తెచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా విస్తృతిని ప్రస్తావించారు. అయితే ఈ యంత్రాన్ని ఐసీఎంఆర్‌ ఆర్డర్‌ ఇచ్చిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి వాదించే నైతికత లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోందని,  రోగులకు చికిత్స, నిధుల వినియోగం, కరోనా కేసుల సంఖ్య, బాధితులకు మృతదేహాల అప్పగింతలో గందరగోళం నెలకొందని టీఆర్‌ఎస్‌ సర్కారుపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. 


ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌  విమర్శలతో మొదలు!

కరోనా వ్యాప్తి ఆరంభంలో వైర్‌సను నియంత్రించడం కోసం, రాష్ట్ర ప్రభుత్వానికి తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని, ప్రతీ కార్యకర్తా సహాయం అందిస్తాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్పష్ట ప్రకటన చేశారు. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనూ విమర్శించబోమని స్పష్టం చేశారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కేంద్రం   ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు, అసంతృప్తి వ్యక్తం చేయడం, కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కమలనాథులు విమర్శలు ఆరంభించడంతో ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర ఆరోపణలకు బీజం పడినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు. వలస కార్మికుల తరలింపు, రైల్వేకోచ్‌ల ఏర్పాటు తదితర కీలక అంశాలపై టీఆర్‌ఎస్‌, బీజేపీ అగ్రనేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. కేంద్రం ప్రకటించిన రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణాకు ఏమాత్రం ప్రయోజనం  కలగదని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌  ఆక్షేపించారు. దీంతో స్పందించిన బీజేపీ నాయకత్వం, ఏయే వర్గాలకు ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో వివరించే ప్రయత్నం చేస్తూనే, కరోనా నియంత్రణకు కేంద్రం రూ.7వేల కోట్లు అందించిందని, పెద్దసంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇచ్చిందని ప్రకటించారు. ఈ నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని, కేంద్రం నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే, కేంద్రం అరకొర నిధులే ఇచ్చింద ని, పీపీఈ కిట్లను బిచ్చం వేసినట్లుగా విదిల్చిందని టీఆర్‌ఎస్‌ మంత్రులు ఆరోపించారు. 

Updated Date - 2020-06-25T08:36:32+05:30 IST