కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-06-18T09:46:08+05:30 IST

కొవిడ్‌-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని లేదా ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

లేదంటే ‘ఆయుష్మాన్‌’ను అమలు చేయండి

టిమ్స్‌ను ఎందుకు వినియోగంలోకి తేలేదు?

నకిలీ విత్తనాలపై చెబితే 5వేల బహుమతి ఓ జోక్‌

ఆ సరఫరాదార్లకు సహకరిస్తోందే టీఆర్‌స్‌: బండి 


హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని లేదా ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కరోనా బారిన పడిన పేదలకు ఉచితంగా చికిత్స అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల కొమ్ముకాసేందుకే ప్రభుత్వం కరోనా చికిత్సపై ధరలను నిర్ధారించిందని విమర్శించారు. ఇన్ని వేల ఖర్చును పేదలు భరించగలరా? అని ప్రశ్నించారు. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు గచ్చిబౌలిలోని టిమ్స్‌ను ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదని నిలదీశారు. కరోనా నియంత్రణ కోసం కేంద్రం నిధులిస్తే ఎందుకు పేదలపై భారం మోపుతున్నారని ప్రశ్నించారు. గాంధీ ఆస్పత్రిలో కూడా కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వ వైఖరి వల్లే వేలాది మందిని హోంక్వారంటైన్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. బుధవారం మీడియాతో సంజయ్‌ మాట్లాడారు.


కరోనా రహిత తెలంగాణ ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. సీఎం ఏకపక్ష నిర్ణయాల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీలో కరోనాను నియంత్రించడం అక్కడి ప్రభుత్వానికి చేతగాకపోవడంతోనే  కేంద్రం బాధ్యత తీసుకుందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందన్న భయంతోనే సీఎం కేసీఆర్‌ 50 వేల మందికి పరీక్షలు చేస్తామంటూ ప్రకటించారన్నారు. ఎమ్మెల్యేలకు, అధికారులకు కరోనా వైరస్‌ సెగ తగలడం వల్ల కూడా సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ 50 వేల పరీక్షలు నిర్వహిస్తామనడం కూడా నమ్మేలా లేదన్నా రు. ఆ పరీక్షలు ఎలా చేస్తారు? ఎప్పటిలోగా చేస్తారు? అనే ది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.


హైదరాబాద్‌లో కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే, కేంద్రం జోక్యం తప్పదని ప్రకటించారు. వైద్యులను, పోలీసులను, అధికారులను కాపాడుకోలేని ప్రభుత్వం ఇంకెవరిని కాపాడుతుందని నిలదీశారు. కొండపోచమ్మసాగర్‌ వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు అందలేదుగానీ, కరోనా మాత్రం వచ్చిందని ఎద్దేవా చేశారు. గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారిని ఇప్పటికీ హోటళ్లకే పరిమితం చేశారని, కనీస పరీక్షలు కూడా నిర్వహించలేదని ఆరోపించారు. నకిలీ విత్తనాల సమాచారం అందించినవారికి రూ. 5వేల బహుమతి ఇస్తామంటూ ప్రభు త్వం చేసిన ప్రకటన జోక్‌ అని విమర్శించారు. అసలు నకిలీ విత్తనాల సరఫరాదారులకు సహకరిస్తున్నదే టీఆర్‌ఎస్‌ నాయకులని ఆరోపించారు. పీడీ యాక్టు పెడితే సగం మంది టీఆర్‌ఎస్‌ నాయకులు జైళ్లలో ఉంటారన్నారు. హరితహారం నిధులు మొత్తం కేంద్రానివే అని పేర్కొన్నారు. కోటి మొక్కల పేరిట కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. 

Updated Date - 2020-06-18T09:46:08+05:30 IST