కేసీఆర్‌దే మత రాజకీయం
ABN , First Publish Date - 2020-11-21T08:57:13+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆరే మతం పేరిట రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. మతతత్వ ఎంఐఎం పార్టీతో కుమ్మక్కై

మజ్లి్‌సతో కుమ్మక్కై బీజేపీపై దుష్ప్రచారం: సంజయ్
ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు
ఆక్రమణల వల్లే వరదలు.. ‘సాయం’ పంపిణీ చేశాకే ఎన్నికలకు వెళ్లాల్సింది
సవాల్‌లో భాగంగా పాతబస్తీలో భాగ్యలక్ష్మి ఆలయానికి బండి సంజయ్
ఉద్రిక్తతల మధ్య పర్యటన.. సీఎం కోసం గంటపాటు ఎదురుచూపు
హైదరాబాద్ సిటీ/చార్మినార్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆరే మతం పేరిట రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. మతతత్వ ఎంఐఎం పార్టీతో కుమ్మక్కై బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన స్థాయిని మరిచి..ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వరద సాయం ఆపివేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తాను లేఖ రాయలేదని, ఈ విషయమై భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేస్తానని.. ఇందుకు సీఎం సిద్ధమేనా? అని గురువారం సంజయ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి ఆయన వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాక కోసం సుమారు గంట పాటు వేచి చూశారు. అనంతరం ఆయన మీడియాతో వరద సాయం నిలిపివేయాలని తాను లేఖ రాశానని స్వయంగా సీఎం చెప్పడం బాధ కలిగించిందని అన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని దుయ్యబట్టారు.
టీఆర్‌ఎస్ వల్లిస్తున్న అభివృద్ధి నినాదాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడం, సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉండడంతో ఏదో రకంగా తమను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కూడా సీఎం స్పందించకుండా ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వరద సాయం పూర్తిగా పంపిణీ చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాల్సిందని అన్నారు. వరద సాయం పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగాయని, రూ.550 కోట్లలో సగం కూడా బాధితులకు అందలేదని తెలిపారు. హైదరాబాద్‌లో బీజేపీని గెలిపిస్తే... నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.25వేలుసాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. తనకు మెడ మీద తలకాయ ఉంది కాబట్టే ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నానని అన్నారు.
అభివృద్ధి ఏది..? ఎక్కడ?
‘‘హైదరాబాద్‌లో అభివృద్ధి ఎక్కడ జరిగింది? చెరువులు, నాలాల ఆక్రమణ వల్లే నగరాన్ని వరదలు ముంచెత్తాయి. విశ్వనగరం.. విషాద నగరంగా మారింది. రోడ్లు గుంతల మయంగా మారాయి’’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ఆపేయడంతో పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల గురించి టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. ‘‘మూసీ నీటిని కొబ్బరి నీళ్ల మాదిరిగా చేస్తామన్నారు... నగరాన్ని డల్లాస్, ఇస్తాంబుల్‌గా మారుస్తామని చెప్పారు కదా.. మర్చిపోయారా?’’ అని ప్రశ్నించారు. కేంద్రంలో పేదోళ్ల ప్రభుత్వం ఉందని... ప్రధానిగా పేదవాడు ఉన్నారని... భాగ్యనగరం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు.
కాగా, సంజయ్ పర్యటించిన సమయంలోనే మక్కా మసీదులో ప్రార్థనలు జరిగే అవకాశం ఉండడంతో డీసీపీ గజరావు భూపాల్ ఆధ్వర్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూజల తర్వాత సంజయ్ వెళ్లిపోవడం, మక్కా మసీదు వద్ద ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించుకోడానికి అందరికీ హక్కులున్నాయని, సోషల్‌మీడియాలో దుష్ప్రచారానికి పాల్ప డే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పంతం నెగ్గించుకున్న సంజయ్
హైదరాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం పక్కా అని ప్రకటిస్తూ వచ్చిన సంజయ్... అన్నంత పనీ చేశారు. పోలీసుల భారీ బందోబస్తు, తీవ్ర ఉద్రిక్తత మధ్య ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ శుక్రవారం 11.30 గంటలకు అఫ్జల్‌గంజ్ చేరుకున్నారు. అక్కడి నుంచి చార్మినార్ వద్దకు చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరోవైపు, సంజయ్ ప్రకటన నేపథ్యంలోచార్మినార్ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎట్టకేలకు సంజయ్ ప్రకటించిన సమయానికి (మధ్యాహ్నం 12 ) రెండు గంటల ముందు పోలీసులు అనుమతి ఇచ్చారు. కాగా, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. జీహెచ్‌ఎంసీ ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోదీపై సీఎం పలు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎస్‌ఈసీకి వినతిపత్రం అందజేశారు.