రాష్ట్రంలో రజాకార్లపాలన
ABN , First Publish Date - 2020-08-16T10:12:02+05:30 IST
రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రజాకార్ల వారసులను ...

- మంచి జరిగితే మీరు చేసినట్లు.. చెడు అయితే కేంద్రంపై నిందలా..?
- టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ధ్వజం
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రజాకార్ల వారసులను కేసీఆర్ పక్కన చేర్చుకున్నారని, వారి అడుగుజాడల్లో నడుస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు నియంత పాలన నడిస్తే, ఇప్పుడు గడీల పాలన సాగుతోందన్నారు. తెలంగాణ అమరుల చరిత్రను తెరమరుగుచేసి.. తన చరిత్ర, తన కుటుంబ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే కుట్రలో భాగంగానే సీఎం కేసీఆర్ సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని సంజయ్ మండిపడ్డారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినట్లుగానే, ఇప్పుడు గడీల పాలనకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా నియంత్రణకు కేంద్రం రూ.7వేల కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారిమళ్లించిందని మండిపడ్డారు. మంచి జరిగితే తన ఖాతాలో వేసుకుంటున్న, సీఎం, చెడు జరిగితే కేంద్రంపైకి నెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజులను నియంత్రించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు మాట్లాడుతూ ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లు, ఎస్‌డీపీఐ(సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా), పీఎ్‌ఫఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) పేరిట కొంతమంది దేశద్రోహులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని జయించినప్పుడే అసలయిన స్వాతంత్య్రం వచ్చినట్లని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, బాబూమోహన్, డాక్టర్ వివేక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులో హైదరాబాద్ సిటీకి నూతన కమిటీలు
ఈ నెలాఖరులో హైదరాబాద్ సిటీకి నూతన కమిటీలు ఏర్పాటవుతాయని సంజయ్ వెల్లడించారు. రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాష్ట్ర కమిటీలో యాదవులకు స్థానం దక్కలేదనడం సరైంది కాదన్నారు. బండ్రు శోభారాణికి యాదవ కోటాలోనే ఉపాధ్యక్ష పదవి దక్కిందన్నారు. బీజేపీ పో రాటం వల్లనే పోతిరెడ్డిపాడుపై కేంద్రం స్పందించిందని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థి ఎవరన్నది పార్టీలో చర్చిస్తామని సంజయ్ చెప్పారు.