‘ఆ నలుగురు’ తో వ్యూహం పన్నిన కమల దళం!

ABN , First Publish Date - 2020-11-13T18:31:50+05:30 IST

దుబ్బాక దంగల్‌లో బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. ఈ విజయ కేతనాన్నే జీహెచ్‌ఎంసీలోనూ ఎగురవేయాలని బీజేపీ డిసైడ్ అయ్యింది.

‘ఆ నలుగురు’ తో వ్యూహం పన్నిన కమల దళం!

హైదరాబాద్: దుబ్బాక దంగల్‌లో బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. ఈ విజయ కేతనాన్నే జీహెచ్‌ఎంసీలోనూ ఎగురవేయాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గ వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసుకుంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలుంటాయని కూడా దాదాపుగా ఖాయం కావడంతో బీజేపీ మరింత దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది. ఏఏ నేతలను ఏఏ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించుకోవాలన్న దానిపై కూడా అధ్యక్షుడు బండి సంజయ్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రెండు మూడు దఫాలుగా వివిధ డివిజన్ల నేతలతో సమీక్షలు కూడా నిర్వహించేశారు. గులాబీ కోటగా స్థిరపడిపోయిన దుబ్బాకలోనే తాము పాగా వేశామని, ముందు నుంచీ పట్టున్న జీహెచ్‌ఎంసీలో పాగా వేయడం తమకు పెద్ద కష్టమేమీ కాదని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


దుబ్బాకలో ఓడిపోయిన నైరాశ్యం, వరద సహాయం అందించడంలో వైఫల్యాన్ని మూటగట్టుకోవడం, డబుల్ బెడ్‌రూం ఇళ్ల లాంటి విషయాల్లో టీఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైందని, ఈ వైఫల్యాలను పునాదులుగా చేసుకొనే... తాము విజయానికి చేరుతామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. వీటన్నింకి తోడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.... మధ్య తరగతి ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేసింది.




భారతీయ జనతా పార్టీకి దేశ వ్యాప్తంగా మధ్య తరగతి, ఉన్నత వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. ఈ వర్గాల్లోనే మోదీపై అభిమానం కూడా ఉంది. అటు మోదీ ఛరిష్మా... ఇటు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రెంటినీ సమతౌల్యం చేయనుంది బీజేపీ. సీఎం కేసీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాలకు దుబ్బాక దగ్గర్లోనే ఉన్నా... అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, తాము వస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ విపరీతంగా ప్రచారం చేసింది. ఈ అంశం బీజేపీకి కూడా బాగా కలిసొచ్చింది. అచ్చు ఇదే వ్యూహాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ, ముఖ్యంగా పాతబస్తీ విషయంలో ఉధృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఎంఐఎం ఇన్నేళ్లుగా పాత బస్తీలో రాజ్యమేలుతోందని, అయినా సరే... అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, తాము వస్తే అభివృద్ధి చేస్తామన్న ప్రచారం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు పాత బస్తీలో హిందువుల ఓట్లను పునరేకీకరణ కూడా చేసి... అటు అభివృద్ధి ఇటు హిందుత్వను మేళవించి పాత బస్తీలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ అని వ్యూహకర్తలు అంటున్నారు. 


ఇక... పై ప్లాన్‌కు అనుగుణంగానే నాయకులను కూడా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ సిద్ధం చేసింది. అయితే కొత్తగా.... ఈ ప్లాన్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా వచ్చి చేరారు. రఘునందన్ రావును కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా వినియోగించుకొని గులాబీ గూటికి షాకివ్వాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ ఈ నలుగురు నేతలతో రాజకీయ చదరంగాన్ని ఎలా రక్తికట్టించాలనుకుంటున్నారో ఓ సారి చూద్దాం....

కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి: 

కిషన్ రెడ్డి పాత తరం నేతల్లతో ఒకరు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నారు. కేంద్ర హోంమంత్రి కూడా. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి ఉన్నత వర్గాలుండే ప్రాంతాలతో పాటు... అంబర్ పేట్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్ లాంటి మధ్య తరగతి ప్రజలు కూడా ఈయన నియోజకవర్గంలో ఉంటారు. ఎలాగూ ఉన్నత వర్గాల్లో మోదీపై అభిమానం, ఆకర్షణ ఉంటుంది కాబట్టి... ఆ కోణాన్ని సక్రమంగా వాడుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. ఇక... మధ్య తరగతి వర్గాల్లో కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను చేరవేయడంతో పాటు... టీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను విస్తృతంగా ఎండగడుతూ... ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇళ్లు, వరద సహాయం విషయంలో టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెడుతూ సాగాలని నిర్ణయించారు.

బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు: 

బండి సంజయ్ కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కార్యక్షేత్రంలో ఎంతకైనా తెగిస్తారన్న పేరూ ఉంది. వీటితో పాటు హిందుత్వను బలంగా ప్రచారం చేయడంలో మంచి పేరును కూడా సంపాదించారు. ఇప్పటికే... ఈ అంశాలను కలుపుతూ ప్రచారం నిర్వహించాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. ఓటర్ల జాబితా నుంచి కేసీఆర్ సర్కార్ హిందువులను ఓట్లను తీసేస్తోందని బండి సంజయ్ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. 

ధర్మపురి అర్వింద్, ఎంపీ: 

టీఆర్‌ఎస్ సర్కార్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తోంది. కేటీఆర్ అన్నీ తానై ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ముందు నుంచి కూడా ఎంపీ అర్వింద్ కేటీఆర్, కవితను టార్గెట్‌గా చేస్తూ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. వాగ్ధాటి, సామెతలను వాడుతూ ఉపన్యసించడం, హిందుత్వాన్ని వాడటం లాంటి విషయాల్లో ధర్మపురి అర్వింద్ సక్సెస్ అవుతారు. నువ్వెంత? అంటే నువ్వెంత? అన్నట్లుగానే అర్వింద్ వ్యవహారం ఉంటుంది. అందుకే జీహెచ్‌ఎంసీలో అర్వింద్ ను రంగంలోకి దించి... కేటీఆర్‌ను టార్గెట్ చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యింది. 

రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాకలో అనూహ్యంగా విజయం సాధించిన ఎమ్మెల్యే రఘునందన్ ను కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ తాజాగా నిర్ణయించుకుంది. వాగ్ధాటి, సీఎం కేసీఆర్ వ్యూహాలను బాగా దగ్గరి నుంచి చూసిన వారు కావడం లాంటి విషయాలను బీజేపీ పరిగణనలోకి తీసుకుందని సమాచారం. అంతేకాకుండా విద్యాధికుడు కూడా కావడంతో మధ్యతరగతి, యువకుల ఓట్లకు రఘునందన్ ద్వారా గాలం వేయించాలని ప్లాన్ వేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఉన్నా... అభివృద్ధిలో దుబ్బాక బాగా వెనుకబడిందన్న ప్రచారాన్ని రఘునందన్ ఎన్నికల్లో బాగా వినియోగించారు. అచ్చు అదే ప్రచారాన్ని కూడా రఘునందన్ ద్వారా పాత బస్తీలో ప్రచారం చేయించి... అటు ఒవైసీని, ఇటు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేసుకుంది.

Updated Date - 2020-11-13T18:31:50+05:30 IST