బీజేపీ దరిదాపుల్లోకి బీసీలు వెళ్లరు!
ABN , First Publish Date - 2020-10-01T07:22:45+05:30 IST
‘‘బీజేపీ దరిదాపుల్లోకి కూడా బీసీలు వెళ్లరు. టీఆర్‌ఎస్ వెంటే శాశ్వతంగా ఉంటారు. వారితో మా పార్టీకి విడదీయరాని బంధం ఉంది. భూమ్మీద టీఆర్‌ఎస్ ఉన్నంత వరకూ బీసీలు....
టీఆర్‌ఎస్ వెంటే శాశ్వతంగా ఉంటారు
వాళ్లకు సీఎం కేసీఆర్ దైవ సమానుడు
కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ లేదేం?
లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి గంగుల ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ దరిదాపుల్లోకి కూడా బీసీలు వెళ్లరు. టీఆర్‌ఎస్ వెంటే శాశ్వతంగా ఉంటారు. వారితో మా పార్టీకి విడదీయరాని బంధం ఉంది. భూమ్మీద టీఆర్‌ఎస్ ఉన్నంత వరకూ బీసీలు మాతోనే ఉంటారు’’ అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీసీల కోసం భారీ బడ్జెట్ కేటాయించడమే కాకుండా బీసీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల సంఖ్యను పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గతంలో ఆరు వేలలోపు బీసీ విద్యార్థులకే ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్య అందేదని, ఇపుడు లక్ష మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. బీసీ విద్యార్థులకు ఓవర్‌సీస్ స్కాలర్‌షి్‌పలు సైతం అందజేస్తున్నామని గుర్తు చేశారు. కోకాపేటలో రూ.82కోట్ల విలువైన స్థలాల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ చేస్తున్నందుకు బీసీలు టీఆర్‌ఎ్‌సకు దూరమవుతారా? అని బీజేపీ నేత లక్ష్మణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి ప్రత్యేక పథకాలు అమలవుతున్నాయా? అని నిలదీశారు.
టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వంటి నాయకుడు, ఆయన రూపొందిస్తున్న పథకాలు తమకూ కావాలని ఇతర రాష్ట్రాల వారూ కోరుకుంటున్నారని చెప్పారు. బీసీ కులాలన్నింటికీ తమ ప్రభుత్వం ఏదో రూపంలో న్యాయం చేస్తోందన్నారు. ఎంబీసీలను గుర్తించిందే తమ ప్రభుత్వమని, వాళ్ల కోసం బీజేపీ ఏం చేసిందో లక్ష్మణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. ‘‘కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ చొరవ చూపుతున్నారు. లక్ష్మణ్ కలలు... కలలుగానే మిగిలిపోతాయి. కేసీఆర్ చిత్రపటాన్ని బీసీలు వాళ్ల ఇళ్లలో దేవుళ్ల పక్కన పెట్టుకుంటున్నారు’’అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లను నేతన్నల పాలిట నిజమైన సిరిసిల్లగా తమ ప్రభుత్వం మార్చిందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నల కోసం సాయం చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ చాలా సార్లు అడిగారని, ఈ విషయంలో లక్ష్మణ్ చొరవ తీసుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. బీసీలకు సీఎం కేసీఆర్ దైవ సమానుడని, ఆయన్ను ఎప్పటికీ వీడరని ధీమా వ్యక్తం చేశారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బీజేపీలో లక్ష్మణ్‌కు పదవి దక్కిందని.. బీసీలందరూ బీజేపీ వెంట వెళ్తారా? అని ఎద్దేవా చేశారు. కుల వృత్తులకు పునర్ వైభవం తెచ్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి బీసీలు దూరమవుతున్నారని, ఈ వాస్తవాన్ని లక్ష్మణ్ గ్రహించాలని హితవు పలికారు. సమయం, సందర్భం వచ్చినపుడు కేసీఆర్ దేశానికి నేత అవుతారని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ లక్ష్మణ్‌ది డమ్మీ పదవి అని ఎద్దేవా చేశారు. ఆయనకు దమ్ముంటే కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయించాలని సవాల్ చేశారు. తమ పార్టీకి బీసీల్లో ఎంతో ఆదరణ ఉందని, అందుకే 2018 ఎన్నికల్లో బీజేపీ వందకుపైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. బీజేపీకి మత రాజకీయాలు తప్ప ఏదీ చేతకాదని విమర్శించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య మాట్లాడుతూ... రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు.