విదేశీ సంస్థల తొత్తు బీజేపీ
ABN , First Publish Date - 2020-11-26T08:25:48+05:30 IST
దేశభక్తుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. విదేశీ సంస్థల తొత్తుగా మారిందని టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ ధ్వజమెత్తారు.

ఎంపీ బండ ప్రకాశ్
హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): దేశభక్తుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. విదేశీ సంస్థల తొత్తుగా మారిందని టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ నినాదం మేకిన్ ఇండియా కానే కాదని.. ేసల్ ఇండియా అని మండిపడ్డారు. పెట్టుబడుల ఉపసంహరణతో ఇప్పటికే రెండున్నర లక్షల ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు. బీజేపీ నేతలు ఇచ్చేది స్వదేశీ నినాదం.. ఎత్తుకునేది విదేశీ నినాదమని దుయ్యబట్టారు.
వాజ్‌పేయి హయాంలో ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే.. మోదీ హయాంలో ఏకంగా 70 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారావచ్చిన దాదాపు రూ.3లక్షల కోట్లను ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు.
రక్షణ రంగంలోనూ ప్రైవేటీకరణ మొదలైందని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలనూ తెగనమ్ముతున్నారని చెప్పారు. రైల్వేకు చెందిన 190 రూట్లను ప్రైవేటీకరించారని, రైల్వే స్టేషన్లదీ అదే పరిస్థితన్నారు. మోదీ తీరు ఇలాగే కొనసాగితే రైల్వేకు పట్టాలు తప్ప ఏమీ మిగిలేట్టు లేవని ఎద్దేవా చేశారు.