ఓట్ల వేటలో బీజేపీ నంబర్ వన్
ABN , First Publish Date - 2020-12-05T08:29:05+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్ల ‘కమాల్’ జరిగింది. గెలుపొందిన సీట్ల లెక్కన టీఆర్‌ఎస్సే ముందంజలో ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కలో మాత్రం కారును కమలం దాటేసింది. ఈసారి బీజేపీకి అత్యధికంగా

టీఆర్‌ఎస్ కంటే 0.64ు ఎక్కువ.. సీట్లలో మజ్లిస్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం
ఫలించిన బీజేపీ భావోద్వేగ వ్యూహం
43 టీఆర్‌ఎస్ సిటింగ్ స్థానాలు బీజేపీకి
నేరేడ్‌మెట్ ఫలితం నిలిపివేత
టీఆర్‌ఎస్ 55, మజ్లిస్ 44, బీజేపీ 48, కాంగ్రెస్ 2
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్ల ‘కమాల్’ జరిగింది. గెలుపొందిన సీట్ల లెక్కన టీఆర్‌ఎస్సే ముందంజలో ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కలో మాత్రం కారును కమలం దాటేసింది. ఈసారి బీజేపీకి అత్యధికంగా 12,13,900 ఓట్లు పోల్‌కాగా (31.43ు), టీఆర్‌ఎస్ 11,89,250 (30.79ు) ఓట్లకు పరిమితమైంది. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 3,46,253 ఓట్లతో సరిపెట్టుకున్న కమలదళం ఈసారి గణనీయమైన పురోగతిని సాధించింది. దానికి పోలైన ఓట్లు అమాంతం మూడున్నర రెట్లు (8.67 లక్షల ఓట్లు) పెరగడం విశేషం.
గత ఎన్నికలతో పోలిస్తే 2.79 లక్షల ఓట్లను టీఆర్‌ఎస్ కోల్పోయింది. 2016లో 4 సీట్లకే పరిమితమైన కమల దళం.. ఈ ఎన్నికల్లో 48 సీట్లను గెలుచుకుని భాగ్యనగరిలో తిరుగులేని శక్తిగా అవతరించింది. మరోవైపు బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎంల హోరాహోరీ పోరులో టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు బోణీ కూడా కొట్టలేకపోయాయి. ఈక్రమంలో ఎంతోమంది స్వతంత్రులు డిపాజిట్లను కోల్పోయారు.. ఒక్క నేరెడుమెట్ డివిజన్ ఫలితం మినహా మిగతా 149 డివిజన్ల ఫలితాలను పరిశీలనలోకి తీసుకుంటే ఓట్లశాతంలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు నేరెడ్‌మెట్ ఫలితాన్ని నిలిపివేశారు. దీంతో మిగతా 149 డివిజన్లలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను లెక్కించారు.
స్వతంత్రులందరి పరాజయం
2016 గ్రేటర్ ఎన్నికల్లో 10.34 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న కమలం పార్టీ ఈసారి ఏకంగా 31.43 శాతానికి ఎగబాకింది. ఇక గత ఎన్నికల్లో 43.85 శాతం ఓట్లను సాధించిన టీఆర్‌ఎస్.. అప్పట్లో 99 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసింది. కానీ ఈసారి భారీగా 13.06 శాతం ఓట్లు గులాబీ పార్టీకి తగ్గిపోయాయి. 99 సీట్ల నుంచి 55 సీట్లకు గులాబీ దళం క్షీణించింది. చాలా డివిజన్లలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరిగింది. దీంతో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది.
ఇక కాంగ్రెస్ మాత్రం గతంలో ఉన్న రెండు సీట్లను నిలుపుకొంది. ఆ పార్టీ ఓటింగ్ శాతం ఘోరంగా తగ్గింది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 10.40 శాతం ఓట్లు రాగా, ఈసారి 5.95 శాతం ఓట్లే వచ్చాయి. గతంలో ఒక్క సీటు ఉన్న టీడీపీ... ఈసారి ఆ ఒక్క సీటును కూడా కోల్పోయింది. టీడీపీకి గతంలో 10.34 శాతం ఓట్లు రాగా, ఈసారి 1.29 శాతం ఓట్లే వచ్చాయి. సీపీఐ, సీపీఎం, టీజేఎ్‌సలకు ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన దాదాపు 500 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఒక్కరు కూడా గెలవలేకపోయారు.
ఓట్ల శాతమిలా..
బీజేపీ 31.43 %
టీఆర్‌ఎస్ 30.79 %
మజ్లిస్ 15.97%
కాంగ్రెస్ 5.95%