పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు రక్షణగా బీజేపీ
ABN , First Publish Date - 2020-11-27T07:48:52+05:30 IST
తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన మాజీ ప్రదాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని మజ్లిస్ నేతలు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర

తాకి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తాం
మజ్లిస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు
సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించరు?
హైదరాబాద్ నుంచి రోహింగ్యాలను తరిమేస్తాం
బీజేపీ 100 సీట్లు గెలుస్తుందన్న సర్వేలతో కేసీఆర్ ఆందోళన: బండి సంజయ్
రాంగోపాల్‌పేట్/కవాడిగూడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన మాజీ ప్రదాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని మజ్లిస్ నేతలు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు రక్షణగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్క సారి వాటిని తాకి చూస్తే తెలుగు జాతి, బీజేపీ కార్యకర్తల దమ్ము ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చాలంటూ ఎంఐఎం నేతలు చేసిన వాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్, పార్టీ నేతలతో కలిసి పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను గురువారం సందర్శించి నివాళులర్పించారు. ఆ సందర్భంగా.. పటాన్‌చెరు డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ మాట్లాడారు.
పీవీ, ఎన్టీఆర్ పట్ల టీఆర్‌ఎ్‌సకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అవసరమున్నప్పుడు పొగడడం, అవసరం లేనప్పుడు అవమానపరిచే నీచ సంస్కృతి ముఖ్యమంత్రిదని ఆరోపించారు. పీవీ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్న వారే ఇలాంటి వాఖ్యలపై స్పందించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. పైగా ఈ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్, పీవీలను విమర్శిస్తే మైనార్టీల ఓట్లు పడతాయనే భ్రమ నుంచి మజ్లిస్ బయటకు రావాలని సూచించారు. మజ్లిస్ దేశద్రోహ పార్టీ అని ముస్లిం సమాజమే గుర్తిస్తుందని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తాము కేంద్రాన్ని కోరతామని తెలిపారు. తెలంగాణలో రోహిగ్యాలు ఉన్నారా? లేరా? డీజీపీ, సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి రోహింగ్యాలను బరాబర్ తరిమేస్తామని పేర్కొన్నారు. పాతబస్తీలో ఎన్నికల తర్వాత సర్జికల్ స్ట్రయిక్ చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర హోంమంత్రే రోహింగ్యాల కోసం 120 శిబిరాలను ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రిగా శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న కేసీఆర్.. హైదరాబాద్‌లో అల్లర్లు జరుగుతాయని చెప్ప డం సిగ్గుచేటన్నారు. సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి పక్కా సమాచారం ఉందంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి.. వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ వందకుపైగా సీట్లు గెలుస్తుందని సర్వేలు రావడంతో ఆందోళన చెందిన సీఎం.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. కాగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపచంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు, తేజస్వీ సూర్యపై కేసు నమోదు చేయడం కక్షసాధింపు చర్యేనని పేర్కొన్నారు.
