ముషీరాబాద్‌‌లో ఫలించిన బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహం

ABN , First Publish Date - 2020-12-06T13:38:17+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో..

ముషీరాబాద్‌‌లో ఫలించిన బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహం

  • ఓటర్లను బీజేపీ వైపు మళ్లించడంలో.. 
  • దోహదపడ్డ అగ్రనేతల ఉపన్యాసాలు 
  • ర్యాలీలు, రోడ్‌షోలు, సభలను సమన్వయం 
  • చేయడంలో శభాష్‌ అనిపించుకున్న బీజేపీ 
  • ముషీరాబాద్‌ నియోజకవర్గం కన్వీనర్‌ రమేష్‌రాం

హైదరాబాద్/రాంనగర్‌ : గ్రేటర్‌ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహం ఫలించింది. దీంతో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లు ఉండగా అందులో అయిదు డివిజన్లలో బీజేపీ గెలిచి టీఆర్‌ఎస్‌ అడ్డాలో బీజేపీ జెండా ఎగురవేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వేసిన ఎత్తుగడ ఫలించింది. అభ్యర్థుల ఎంపిక ఒక ఎత్తు అయితే అందుకు గెలుపు కోసం బీజేపీ ప్రచారం ఉండడం ఎంతో దోహదపడింది.


ముఖ్యంగా నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు పార్టీకి చెందిన వివిధ జిల్లాల నేతలను ఇన్‌చార్జిగా నియమించడం అందులో బలమైంది. డివిజన్‌కు 50 నుంచి 100 మందిని తీసుకొచ్చి ప్రచారం చేయించారు. విశ్వహిందూ పరిషత్‌, ఏబీవీపీ, వివిధ అనుబంధ సంస్థల కార్యకర్తలు చాపకిందనీరు లాగా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓట్లు పడేలా ప్రయత్నం చేశారు. బూత్‌ల వారీగా ప్రచారం చేసి, అపార్ట్‌మెంట్‌ వాసులు, బస్తీ, కాలనీ, మహిళా సంఘాలను కలిసి వారిని తమవైపు వచ్చేలా కృషి చేశారు. అభ్యర్థులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలవడం, వారింట్లో పెద్దమనుషుల కాళ్లు మొక్కడం వంటి కార్యక్రమాలు చేసి వారి మనసులు దోచుకున్నారు.


ఎన్నికల ప్రచారం ముగింపు దశలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ధీటుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, నిజామాబాద్‌ ఎంపీ డి.అరవింద్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్‌షోలో పాల్గొని ప్రజలను పార్టీ పట్ల ఆకర్షితులను చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షో, రాంనగర్‌ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభ మాట్లాడిన మాటలు ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితులను చేశాయి. దీంతో బీజేపీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా ఒంటరి పోరాటం చేసి అయిదు డివిజన్లను కైవసం చేసుకోవడం జరిగింది. 


ముషీరాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలను, అభ్యర్థులను సమన్వయం చేస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ ముషీరాబాద్‌ అసెంబ్లీ కన్వీనర్‌ రమే్‌షరాం రచించిన వ్యూహం ఫలించింది. పార్టీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సూచించిన ప్రకారం అన్ని డివిజన్లలో అగ్రనేతల రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, సభలు ఏర్పాటు చేశారు. రూట్‌ మ్యాప్‌లను నిర్ణయించడంలో రమే్‌షరాం ప్రత్యేక దృష్టి సారించారు. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అగ్రనేతలను తీసుకెళ్లి వారి ఉపన్యాసాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రచార నిర్వహణలో ఆయన తీసుకున్న చొరవ అభ్యర్థుల విజయానికి దోహదపడడం పట్ల అగ్రనేతలు, అభ్యర్థులు ఆయనను అభినందించారు.

Updated Date - 2020-12-06T13:38:17+05:30 IST