టెండర్లపై సీబీఐ విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2020-05-24T08:57:07+05:30 IST

కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించి కొత్తగా పిలిచిన టెండర్లపై ..

టెండర్లపై సీబీఐ విచారణ చేపట్టాలి

  • గవర్నర్‌ తమిళిసైకి బీజేపీ వినతి

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించి కొత్తగా పిలిచిన టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ తమిళిసైకి బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. పాత ప్రాజెక్టులను అర్ధంతరంగా వదిలేసిన ప్రభు త్వం కొత్త ప్రాజెక్టులను చేపడుతోందని ఫిర్యాదు చేశారు. అనంతరం బండి సంజ య్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులు, అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయకుండా, కాళేశ్వరంలో మూడో టీఎంసీ కోసం టెండర్లు పిలవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీడియాను సీఎం కేసీఆర్‌ బెదిరించి నియంత్రిస్తున్నారని ఆరోపించారు.


హుందాతనం లేని కేసీఆర్‌

బీజేపీ కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌కు హుందాతనం లేదని నిరూపించుకున్నారని ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. తన నివాసంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘మా కార్పొరేటర్లను మీరు డిస్టర్బ్‌ చేస్తే.. మీ కార్పొరేట్‌ కంపెనీలను మేం డిస్టర్బ్‌ చేస్తం.. మా ఎంపీటీసీలను డిస్టర్బ్‌ చేస్తే మీ ఎంపీలను, మా జిల్లా పరిషత్‌ను డిస్టర్బ్‌ చేస్తే.. మీ ప్రగతి భవన్‌ డిస్టర్బ్‌ చేస్తం.. మాకు అంత దమ్ముంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.  

Updated Date - 2020-05-24T08:57:07+05:30 IST