అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం

ABN , First Publish Date - 2020-10-14T06:55:56+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని, రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ

అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం

ముఖ్య నేతల గృహ నిర్బంధం.. ముందస్తు అరెస్టులు


హైదరాబాద్‌, అక్ట్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని, రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదేశాలతో ఉదయం వరకూ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న పార్టీ నగర నాయకులు మెరుపు ముట్టడికి దిగారు. భారీ వర్షంలోనూ ఉదయం నుంచే దశల వారీగా పెద్ద సంఖ్యలో చేరుకుని, ప్లకార్డులతో తమ డిమాండ్లను ప్రదర్శించారు. అసెంబ్లీ వద్ద బలగాలను భారీగా మోహరించినా బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ గేటు వద్దకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.


పోలీసులు మరిన్ని బలగాలను రంగంలోకి దించి బీజేపీ కార్యకర్తలను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి వస్తున్న బీజేపీ, కేవీపీఎస్‌, టీపీటీఎఫ్‌, ప్రైవేటు టీచర్స్‌ ఫోరం నాయకులను వికారాబాద్‌, మేడ్చల్‌, తాండూరు తదితర నగర శివారు ప్రాంతాల్లో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ నేతలు సోమవారం రాత్రి 10 గంటలకు నిర్ణయించారు. ఈ సమాచారం పోలీసులకు అందడంతో అసెంబ్లీ పరిసరాల్లో 1100 మంది సివిల్‌, ఏఆర్‌, ట్రాఫిక్‌ పోలీసులను మోహరించారు. ఉదయం 10 గంటల నుంచే వాహనాలను దారి మళ్లించారు. 400 మంది బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 


కార్యకర్తలకు హేట్సాఫ్‌: సంజయ్‌

చివరి నిమిషం వరకూ గోప్యత పాటిస్తూ మెరుపు ముట్టడిని విజయవంతం చేసిన కార్యకర్తలకు హేట్సాఫ్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించారు. జీహెచ్‌ఎంసీలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సిద్ధంగా ఉన్నాయన్న ప్రభుత్వం లబ్ధిదారులకు వెయ్యి ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓ జోక్‌గా మార్చిందన్నారు. కాగా, బండి సంజయ్‌ బుధవారం ఉదయం దుబ్బాక వెళ్లనున్నారు. పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు.

Updated Date - 2020-10-14T06:55:56+05:30 IST