మోదీ ఫొటో తొలగింపుపై బీజేపీ ఆగ్రహం!
ABN , First Publish Date - 2020-12-29T07:42:11+05:30 IST
రైతు వేదికపై ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ ఫొటోను తొలగించారని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడం, మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది
మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం
కమలం కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి
ధన్వాడ, డిసెంబరు 28 : రైతు వేదికపై ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ ఫొటోను తొలగించారని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడం, మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. నారాయణపేట జిల్లా ధన్వాడలో సోమవారం రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అయితే, ఇక్కడి రైతు వేదికపై ప్రధానమంత్రి మోదీ ఫొటోను బీజేపీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజాము వరకూ ఉన్న ఫొటోను వేదిక ప్రారంభానికి ముందు తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. బీజేపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఉమే్‌షకుమార్‌గుప్తా, జట్రం గోవర్ధన్‌గౌడ్, రాంచంద్రయ్య, మల్లయ్య, అంజియాదవ్‌తోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి మరికల్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం రైతు వేదిక ప్రారంభానికి వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు పట్టుకొని కాన్వాయ్‌కి అడ్డంగా రావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. అనంతరం రైతు వేదికను మంత్రులు ప్రారంభించారు.