కంచె చేను మేసింది!
ABN , First Publish Date - 2020-08-01T07:12:30+05:30 IST
ఏఈఓ రవికుమార్‌పై గతంలోనే పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. చేవెళ్ల మండలంలోని కుమ్మెర గ్రామానికి చెందిన ఓ రైతు మృతి చెందడంతో.. అతడి పేరిట ఉన్న బీమా డబ్బుల్ని ఇప్పించాలని మృతుడి కుటుంబసభ్యులు రవికుమార్‌ను

చేవెళ్ల, జూలై 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బంధు సొమ్మును రైతులకు చేరేలా చూడాల్సిన ఆ అధికారే సొమ్మును కాజేశాడు. కంచె చేను మేసిన చందాన.. రైతుల డబ్బు రూ. 2.80లక్షలను తన భార్య ఖాతాలోకి మళ్లించాడు. అధికారులకు అనుమానం వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో చేవెళ్ల క్లస్టర్ ఏఈఓగా రవికుమార్ గత కొంతకాలంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది వానాకాలం సాగుకు సంబంధించి.. రైతుబంధు పథకంలో చేవెళ్ల క్లస్టర్ పరిధిలోని ఎనిమిది గ్రామాలకు సంబంధించిన 16మంది రైతుల బ్యాంకు ఖాతా సంఖ్యకు బదులుగా.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన భార్య పేరు మీద ఉన్న ఖాతా నెంబర్(862810110014708)ను ఉంచారు. దీంతో.. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు డబ్బులు రైతులకు చేరడం బదులు సరాసరి ఆయన భార్య ఖాతాకే జమయ్యాయి. గత ఏడాది యాసంగిలో కూడా ఒకే బ్యాంకు ఖాతా నెంబర్ 16 చోట్ల కనిపించడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు గమనించారు. కమిషనర్ దృష్టికి విషయం వెళ్లడంతో.. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో రవికుమార్ బాగోతం బయటపడింది. హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఆయన భార్య ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ అయినట్లు గుర్తించారు. మొత్తం వ్యవహారంపై అధికారుల నివేదికను పరిశీలించిన మీదట.. ఏఈఓ రవికుమార్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆమాయ్ కుమార్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు.. అధికారులు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.
గతంలోనే పలుమార్లు సస్పెన్షన్
ఏఈఓ రవికుమార్‌పై గతంలోనే పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. చేవెళ్ల మండలంలోని కుమ్మెర గ్రామానికి చెందిన ఓ రైతు మృతి చెందడంతో.. అతడి పేరిట ఉన్న బీమా డబ్బుల్ని ఇప్పించాలని మృతుడి కుటుంబసభ్యులు రవికుమార్‌ను కోరారు. అందుకు రవికుమార్ లంచం డిమాండ్ చేయడంతో.. వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో లంచం ఆరోపణలు నిజమని తేలడంతో ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ గత ఏడాది డిసెంబర్ 23న రవికుమార్‌పై 6 నెలల సస్పెన్షన్ విధించారు. అప్పటి నుంచి రవికుమార్ సస్పెన్షన్‌లోనే ఉన్నారు. చేవెళ్లలో విధులు నిర్వర్తించే సమయంలోనే రవికుమార్ తన భార్య బ్యాంకు ఖాతాలోకి రైతుబంధు డబ్బులు మళ్లించినట్లు సమాచారం.