పైసలు మీ జేబుల్లోంచి ఇస్తున్నారా?

ABN , First Publish Date - 2020-03-13T09:29:53+05:30 IST

విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపు విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీశ్‌రావు మధ్య అసెంబ్లీలో సంవాదం చోటు చేసుకుంది. ఉపకార వేతనాలకు నిధులు

పైసలు మీ జేబుల్లోంచి ఇస్తున్నారా?

స్కాలర్‌షిప్‌ల నిధుల్లో ఎలా కోత పెడతారు?

కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైంది?: భట్టి

కాంగ్రెస్‌ పాలనలో మీ జేబుల్లోంచే ఇచ్చారా?

ఈ సోయి అప్పుడెందుకు లేదు?: మంత్రి హరీశ్‌


హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపు విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీశ్‌రావు మధ్య అసెంబ్లీలో సంవాదం చోటు చేసుకుంది. ఉపకార వేతనాలకు నిధులు ఎలా కోత పెడతారు? మీ జేబుల్లోంచి ఏమైనా ఇస్తున్నారా?అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్‌ పాలనలో మీ జేబుల్లోంచే ఇచ్చారా?అని హరీశ్‌ ఎదురు ప్రశ్నించారు. అసెంబ్లీలో గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి, సీఎం ఉపన్యాసాలిచ్చారు. మాపై ఏదో మాట్లాడి సీఎం వెళ్లిపోయారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు సీఎం సభలో ఉండొద్దా?’’అని ప్రశ్నించారు. దీంతో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి కల్పించుకుని సీఎంనుద్దేశించి అలా మాట్లాడడం సరికాదన్నారు. వెంటనే భట్టి స్పందిస్తూ సీఎం సభలో ఉంటే శోభ ఉంటుందని, ఆయనను తిరిగి పిలిపించాలని స్పీకర్‌ను కోరారు. ‘‘2019-20లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించాల్సిన ఉపకార వేతనాల్లో రూ.1,269 కోట్లు కోత పెట్టారు. పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేదు. మీ జేబుల్లోంచి ఇస్తున్నారా? కిసీ బాప్‌ కా నహీ’’ అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును తామే కట్టామని ప్రభుత్వం చెప్పుకొంటోందని, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, కడెం, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించామని గుర్తు చేశారు. 2014 తర్వాత ఒక్క పవర్‌ ప్రాజెక్టైనా పూర్తి చేశారా?అని నిలదీశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైందని ప్రశ్నించారు. సాదాబైనామాల విషయమై మాట్లాడుతూ తహసీల్దార్‌ను పెట్రోల్‌ పోసి తగులబెట్టిన సంఘటన టీఆర్‌ఎస్‌ పాలనలోనే జరిగిందని ధ్వజమెత్తారు.

 

నిధులు తగ్గించం

భట్టి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉపకార వేతనాలకు ఒక్క రూపాయి కూడా తగ్గించమని అన్నారు. ‘‘ఎస్సీఎ్‌సడీఎఫ్‌కు రూ.16,535 కోట్లు, ఎస్టీఎ్‌సడీఎ్‌ఫకు రూ.9771 కోట్లు కేటాయించాం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఈ సోయి ఏమైంది. అప్పుడు ఉపకార వేతనాలను మీ జేబుల్లోంచి ఇచ్చారా?’’ అని నిలదీశారు. ఎల్లంపల్లిని నిర్మించామని చెబుతున్నారు కదా.. ఎప్పుడైనా చుక్క నీటిని నిల్వ చేశారా? అని ప్రశ్నించారు. పులిచింతల నిర్మాణానికి వ్యతిరేకంగా తాము మంత్రి పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. తమది ప్రజాపక్షమని, ప్రతి పైసాను పేదల సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నామన్నారు. స్పీకర్‌ మాట్లాడే సమయం ఇవ్వడం లేదంటూ భట్టి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌ ఖండించారు. స్పీకర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-03-13T09:29:53+05:30 IST